చెప్పేదొకటి చేసేదొకటి.. ప్రీ లాంచ్ మాయ ..గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న రియల్టర్లు, బిల్డర్ల మోసాలు

చెప్పేదొకటి చేసేదొకటి..  ప్రీ లాంచ్ మాయ ..గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ పెరుగుతున్న రియల్టర్లు, బిల్డర్ల మోసాలు
  • అగ్రిమెంట్ ప్రకారం పూర్తికాని అపార్ట్‌‌‌‌మెంట్ల నిర్మాణాలు 
  • కొనుగోలుదారులకు గడువులోగా అందని ఫ్లాట్లు అత్యాధునిక సౌలతులంటూ అదనపు వసూళ్లు 
  • ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్లు చేతికందక బ్యాంక్ లోన్లు కడుతూ బాధితుల ఇబ్బందులు  
  • రెరాకు పెరుగుతున్న ఫిర్యాదులు 
  • 2,539  రెరాకు వచ్చిన కంప్లయింట్స్ 
  • 1,682 ఇప్పటివరకు పరిష్కరించినవి

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​ సిటీ చుట్టూ రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రీ లాంచ్‌‌‌‌ల పేరుతో కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్‌‌‌‌మెంట్లు, విల్లాల నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. గడువులోగా ఫ్లాట్లను, ప్లాట్లను అప్పగించడం లేదు. చెప్పిన సౌలతుల (ఎమినిటీస్)ను  కల్పించడం లేదు. ముందు చెప్పేదొకటి.. ఆ తర్వాత చేసేదొకటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 

ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్‌‌‌‌గా డబ్బులు తీసుకొని, అది​ కంప్లీట్ ​చేయకుండానే.. ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అపార్ట్‌‌‌‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసినోళ్లేమో.. అవి తమ చేతికి అందక, సొంతింటి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని నెలలు, సంవత్సరాల తరబడి రియల్టర్లు, బిల్డర్లు చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)లో రోజురోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2,539 కంప్లయింట్స్ వచ్చాయి. వీటిలో 1,682 కంప్లయింట్స్‌ను పరిష్కరించారు. 

విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం..  

గ్రేటర్​హైదరాబాద్​చుట్టూ రియల్ ఎస్టేట్​రంగం భారీగా విస్తరిస్తున్నది. రూ.కోటి లేనిదే 3 బీహెచ్‌కే ఫ్లాట్ రావడం లేదు. ఇండిపెండెంట్​హౌస్‌లు, ఫ్లాట్లు, విల్లాలు కొనాలంటే భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఓఆర్ఆర్ పరిసరాల్లో రూ.50 లక్షల నుంచి ఫ్లాట్లను, రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఇండిపెండెంట్​హౌస్‌లను అమ్ముతున్నారు. ఇక గేటెడ్​కమ్యూనిటీ ప్రాజెక్లుల్లో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల మధ్య విల్లాలు విక్రయిస్తున్నారు. సిటీకి దగ్గరగా, ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉన్న గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట ఏరియాలో రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కువగా ప్రీమియం ప్రాజెక్టులు చేపడుతున్నాయి. 

కొల్లూరు వరకు లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్నాయి. ఆఫీసులకు దగ్గరగా ఉండాలనుకునే ఐటీ ఉద్యోగులు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌‌పోర్టుకు దగ్గరగా గచ్చిబౌలి నుంచి రాజేంద్రనగర్ వరకు అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎయిర్‌‌పోర్ట్​చుట్టుపక్కల తుక్కుగూడ, రావిర్యాల పరిసర ప్రాంతాల్లో విల్లాలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఇక్కడ పదికి పైగా సంస్థలు విల్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు చేపట్టాయి. 

ఆదిభట్ల, బొంగులూరు ఏరియాలో ఎక్కువగా అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉండగా.. పెద్ద అంబర్‌‌పేట చుట్టుపక్కల ఇండింపెండెంట్ హౌస్‌లు, విల్లాలు, ఘట్‌కేసర్​ఏరియాలో అపార్ట్‌మెంట్లు అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్, శామీర్‌‌పేట చుట్టుపక్కల విల్లాలు, లగ్జరీ గేటెడ్​కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్ బయట కూడా విల్లా ప్రాజెక్టులు, వెంచర్లు ఎక్కువగా వస్తున్నాయి. 

రెరా పర్మిషన్ లేకుండానే ప్రాజెక్టులు.. 

రాష్ట్రంలో రెరా గుర్తింపు పొందిన ప్రాజెక్టులు 10,225 ఉన్నాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్​హైదరాబాద్​చుట్టూనే ఉన్నాయి. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం, 8 కంటే ఎక్కువ యూనిట్లు ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే రెరా అనుమతులు లేకుండానే చాలామంది రియల్టర్లు, బిల్డర్లు గ్రేటర్‌‌లో ఇండ్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టి అమ్ముతున్నారు. రెరా గుర్తింపు ఉందంటూ బ్రోచర్లలో ముద్రించి ప్రీ లాంచింగ్​పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. 

రెరా రిజిస్ట్రేషన్ పొందకుండానే ప్లాట్లు, ఫ్లాట్ల బుకింగ్, సేల్స్, ఆఫర్ ఫర్ సేల్, మార్కెటింగ్, ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నిధులు సమీకరిస్తున్నారు. రెరా అనుమతులు పొందిన ప్రాజెక్టులలో కూడా మోసాలు జరుగుతున్నట్టుగా కంప్లయింట్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేయడానికి బ్రోచర్లు ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ, ప్రాజెక్ట్ పేరు, లోగో, లొకేషన్ మ్యాప్, ఎమినిటీస్​తదిరత వివరాలను, నియర్​బై ఐటీ హబ్స్, స్కూల్స్​, హాస్పిటల్స్​, మెట్రో, హైవే కనెక్టివిటీ అంటూ ఆకర్షణీయంగా బ్రోచర్లను ముద్రించి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. 

‘లగ్జరీ లివింగ్ ఇన్ గ్రీన్ సరౌండింగ్స్’ అంటూ ట్యాగ్‌లైన్లు ఇస్తున్నారు. ఈ ప్రచారాన్ని చూసి చాలామంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. కానీ తీరా అగ్రిమెంట్ల ప్రకారం ప్లాట్లను, ఫ్లాట్లను, విల్లాలను రియల్ ఎస్టేట్ సంస్థలు అప్పగించడం లేదు. దీంతో అడ్వాన్స్​గా ముందే డబ్బులు చెల్లించి, ఇందుకోసం బ్యాంకు రుణాలు తీసుకోవడంతో గృహ ప్రవేశాలు జరగముందే నెలకు రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు ఈఎంఐలు చెల్లిస్తూ కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఎమినిటీస్ విషయంలోనూ మోసాలు..  

రియల్టర్లు, బిల్డర్లు ఎమినిటీస్ పేరుతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. తాము చేపడుతున్న ప్రాజెక్టుల్లో అత్యాధునిక సౌలతులు కల్పిస్తామంటూ కొనుగోలుదారులను నమ్మించి ముంచుతున్నారు. వీటి కోసమంటూ రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు అదనంగా వసూలు చేసి, తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు. యోగా, ధ్యాన కేంద్రం, వాలీబాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, అసోసియేషన్ ఆఫీసు, స్విమ్మింగ్ పూల్, స్పా, పార్టీ లాన్స్, డాక్టర్ కన్సల్టెన్సీ రూమ్, సెక్యూరిటీ, క్లబ్‌హౌస్, ఇండోర్, అవుట్​డోర్ ​స్పోర్ట్స్​ఫెసిలిటీస్, సోషల్, కమ్యూనిటీ స్పేసెస్,​ ఈవీ చార్జింగ్​ స్టేషన్స్​ తదితర సౌలతులు కల్పిస్తామంటూ బ్రోచర్లలో పేర్కొంటున్నారు. కానీ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అవేవీ పూర్తి చేయడం లేదని కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఒక ప్రాజెక్ట్​ కోసం కట్టిన డబ్బులను ఇతర ప్రాజెక్టులకు మళ్లిస్తున్నారన్న కంప్లయింట్స్ కూడా వస్తున్నాయి. 

కంప్లయింట్లపై రెరా చర్యలు.. 

రియల్ ఎస్టేట్ మోసాలపై రెరాలో పెద్ద ఎత్తున కంప్లయింట్స్ నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 2,539 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 1,682 కంప్లయింట్స్‌‌‌‌పై విచారణ చేపట్టిన రెరా.. వాటి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన సంస్థలు, ప్రాజెక్ట్​ ఓనర్లకు రూ.5 లక్షల నుంచి రూ.కోటికి పైగా ఫైన్లు వేసింది. తమ ఉత్తర్వులను పట్టించుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా పోతున్న 8 సంస్థలను డిపాల్టర్లుగా పేర్కొంది. అలాగే 7 ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. 


కంప్లయింట్లపై రెరా చర్యలు.. 

    రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామం రంగనాథనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సుమారు 850 మంది ప్లాట్​ ఓనర్స్.. తమకు చెందిన రూ.6 వేల కోట్ల భూములపై ఓ పెద్ద సంస్థ కన్నేసిందని ఇటీవల రెరాలో ఫిర్యాదు ఇచ్చారు. తాము 1986 నుంచి 90 వరకు జీపీ పరిధిలో ప్లాట్లను కొని రిజిస్ట్రేషన్​చేసుకోగా, తమకు తెలియకుండానే ఆ సంస్థ డబుల్​రిజిస్ట్రేషన్​ చేసుకున్నదని పేర్కొన్నారు. సంస్థ ప్రతినిధులు తమను ఖాళీ చేయించి 60 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారని వాపోయారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామని, ఆ సంస్థకు రెరా అనుమతులు ఇవ్వొద్దని కోరారు. 

బోడుప్పల్‌‌‌‌లో ఓ రియల్ ఎస్టేట్​ సంస్థపై పబ్లిక్ కాషన్ అన్‌‌‌‌ రిజిస్టర్డ్ మార్కెటింగ్ కంప్లయింట్ నమోదైంది. దీనిపై విచారణ జరిపిన రెరా.. ఆ సంస్థకు రూ.19.96 లక్షల ఫైన్ వేసింది. ఫిర్యాదు చేసిన వారికి రీఫండ్ చేయాలని ఆదేశాలిచ్చింది.​ సంస్థపై లీగల్​యాక్షన్‌‌‌‌కు సిఫారసు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో ఉత్తర్వులు జారీ చేసింది.  

ఓ సంస్థ అగ్రిమెంట్​ ప్రకారం పనులు పూర్తి చేయలేదని 68 మంది కొనుగోలుదారులు చేసిన ఫిర్యాదుపై రెరా విచారణ చేపట్టి.. ఆ సంస్థకు రూ.14.90 లక్షల ఫైన్​ వేసింది.  కొనుగోలుదారులకు 11% వడ్డీతో డబ్బులు రీఫండ్ ​చేయాలని ఆదేశించింది. ఆ సంస్థ సేల్స్‌‌‌‌ను నిషేధిస్తూ గత మేలో ఉత్తర్వులిచ్చింది. 

ఇవే కాకుండా ఆస్తిని రెరా కింద నమోదు చేయడంలో విఫలమైతే రియల్టర్/ బిల్డర్‌‌‌‌‌‌‌‌కు బిల్డింగ్​కాస్ట్‌‌‌‌లో 5 శాతం జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే ప్రాజెక్ట్​కాస్ట్‌‌‌‌లో 5 శాతం ఫైన్, రెరా ట్రిబ్యునల్స్ నిర్ణయాలను విస్మరిస్తే 10 శాతం జరిమానా, ఏడాది జైలు శిక్ష, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ప్రాజెక్ట్​కాస్ట్​లో 10 శాతం జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, తప్పుడు సమాచారం అందిస్తే బిల్డింగ్​కాస్ట్​లో 5 శాతం ఫైన్, ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయలేకపోతే రిజిస్ట్రేషన్​రద్దు చేయడం, భారీ జరిమానాలు విధించడం లాంటి చర్యలను రెరా తీసుకుంటున్నది.