
- ఎండలో ఆస్పత్రికి 7 కి.మీ. నడిచిన గర్భిణి..వడదెబ్బ తగిలి మృతి
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దహను తాలూకాలో నిండు గర్భిణి అయిన ఓ గిరిజన మహిళ ట్రీట్మెంట్ కోసం ఎర్రటి ఎండలో 7 కి.మీ నడిచింది. దాంతో వడదెబ్బ తగిలి కడుపులోని బిడ్డతో సహా మహిళ మృతి చెందింది. ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్(21) తొమ్మిది నెలల ప్రెగ్నెంట్. శుక్రవారం ఆమె పాల్ఘర్ జిల్లాలోని తవా పీహెచ్‌సీ(ప్రైమరీ హెల్త్ సెంటర్)కి మెడికల్ చెకప్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంది. సరైన రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో ఆ గ్రామానికి అంబులెన్సులు రావు. దాంతో సోనాలి మండుతున్న ఎండలోనే 3.5 కిలోమీటర్లు నడిచి సమీపంలోని హైవే పైకి చేరుకుంది.
అక్కడి నుంచి తవా పీహెచ్‌సీకి వెళ్లింది. పీహెచ్‌సీలో చికిత్స అందించిన డాక్టర్లు ఆమెను తిరిగి ఇంటికి వెళ్లాలని సూచించారు. దాంతో సోనాలి మళ్లీ హైవే నుంచి ఎండలోనే మూడున్నర కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకుంది. రానూపోనూ ఏడు కిలోమీటర్లు ఎర్రటి ఎండలో నడవడంతో సాయంత్రానికి గర్భిణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. దాంతో కుటుంబసభ్యులు ఆమెను దుండల్‌వాడి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. సొనాలికి చాలా సీరియస్ గా ఉందని గుర్తించిన పీహెచ్‌సీ సిబ్బంది.. వెంటనే కాసా సబ్-డివిజనల్ హాస్పిటల్ (ఎస్‌డిహెచ్)కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు.. సొనాలి పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను దుండల్‌వాడిలోని స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యలో సొనాలి మృతిచెందింది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. వడదెబ్బతోనే నిండు గర్భిణి అయిన సొనాలి మరణించినట్లు డాక్టర్లు వివరించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.