- హాస్పిటల్ ఎదుట బాధితుల ఆందోళన
మేడిపల్లి, వెలుగు: పీర్జాదిగూడ బుద్ధానగర్‌లోని లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి కోమాలోకి వెళ్లింది. బాధితుల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌కు చెందిన నేహా (24) తొమ్మిది నెలల గర్భిణి. సోమవారం సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. డ్యూటీ డాక్టర్ లేని సమయంలో అక్కడి నర్సు ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి పంపారు. అది తీసుకున్న అరగంటలోనే నేహా తీవ్ర అస్వస్థతకు గురై, ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయింది.
ఆందోళనతో మళ్లీ అదే ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు అందుబాటులో లేకపోవడమే కాకుండా, బాధ్యతారాహిత్యంగా వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. ప్రస్తుతం నేహా బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతువుతో పోరాడుతోంది. కాగా, లైఫ్ స్ప్రింగ్ యాజమాన్యంపై, సదరు నర్సుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.

