అకాల వర్షంతో అపార నష్టం

అకాల వర్షంతో  అపార నష్టం
  • అకాల వర్షంతో అన్నదాతకు అపార నష్టం 
  • కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
  • పిడుగుపాటుతో 11 మందికి గాయాలు

సిద్దిపేట/కామారెడ్డి/లింగంపేట, వెలుగు: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం కురిసిన వానకు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట మండలంలోని  పలు గ్రామాల్లో వర్షం కురిసింది. పోతారం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేసి రవాణాకు రెడీ చేసిన వందలాది బస్తాల వడ్లు తడిచిపోయాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, రాజంపేట, భిక్కనూరు, లింగంపేట మండలాల్లో  అకాల వర్షానికి కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. మక్కలు  తడిసిపోయాయి. మాచారెడ్డి మండలంలో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి.
 
పిడుగుపాటుతో రైతులకు గాయాలు
కోనరావుపేట మండలం మామిడిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు పడడంతో ఐదుగురు రైతులకు గాయాలయ్యాయి. వారిని వేములవాడలోని ప్రైవేట్ ​హాస్పిటల్​కు తరలించారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండా శివారులో వర్షం పడుతోందని రైతులు చెట్టు కింద నిలబడ్డారు. అదే చెట్టుపై పిడుగు పడడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.  వీరిని ట్రీట్​మెంట్​ కోసం  కామారెడ్డి జిల్లా హాస్పిటల్​కు తరలించారు.