- ఏఎంసీ, సుడా పోస్టుల భర్తీకి సన్నాహాలు
- సంగారెడ్డి జిల్లాలో నేతల మధ్య కుదరని సయోధ్య
- పటాన్ చెరు, నారాయణఖేడ్ పెండింగ్
సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు మొదలయ్యాయి. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన మార్కెట్ కమిటీలు, ఆలయ పాలక మండలి కమిటీలు ఏర్పాటు చేసినా సిద్దిపేటలో మాత్రం వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 మార్కెట్ కమిటీలు, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) కమిటీ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు.
కాంగ్రెస్ మండల, నియోజకవర్గ నేతలు ఈ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు దుబ్బాక నియోజకవర్గంలోని 5 మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయడంతో సిద్దిపేట నేతల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి.
ఏఎంసీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
సిద్దిపేట నియోజకవర్గంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాబితాలు పెండింగ్ లో పెట్టారు. సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ల ఏర్పాటుపై గతంలో కొంత మేర కసరత్తు జరిగినా ఒక్క కమిటీని ఏర్పాటు చేయలేదు.
నేతల ప్రయత్నాలు ముమ్మరం
పంచాయతీ ఎన్నికల కోడ్ ముగియడంతో సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరక్టర్ పదవుల కోసం నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహతో పాటు జిల్లా ముఖ్య నేతలను కలుస్తూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరికొందరు నేతలు తమ బయోడేటాను ఆయా నేతలతో ఎండార్స్ చేయించుకుంటున్నారు.
సుడా ఏర్పాటు ఆలస్యం
సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్అథార్టీ చైర్మన్, డైరెక్టర్ పదవుల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లాస్థాయి పదవులు కావడంతో జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు చైర్మన్ తో పాటు డైరెక్టర్ పదవులను ఆశిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 26 మండలాలకు సుడాను విస్తరించడంతో పలువురు ముఖ్య నేతలు పోటా పోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సుడా చైర్మన్ పదవిని సిద్దిపేట నియోజకవర్గానికే కేటాయించాలనే కొందరు డిమాండ్ చేస్తున్నారు.
పటాన్ చెరు, నారాయణఖేడ్ పెండింగ్
సంగారెడ్డి జిల్లాలో నామినేటెడ్ పోస్టులను నెలాఖరులోగా భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశలు నింపుతోంది. సదాశివపేట ఏఎంసీ చైర్మన్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి ఇటీవల సర్పంచ్ గా ఎన్నిక కావడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. ఆ స్థానాన్ని మస్కు అలవేణితో భర్తీ చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రస్తుతం పటాన్ చెరు, నారాయణఖేడ్, సదాశివపేట ఏఎంసీ పాలకవర్గాల ఏర్పాటు ఆసక్తికరంగా మారింది.
జిల్లాలో 8 ఏఎంసీలు
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. పటాన్ చెరు, నారాయణఖేడ్ మినహా సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, రాయికోడ్, వట్ పల్లి, జోగిపేట మార్కెట్ కమిటీలను దాదాపు రెండేళ్ల కిందనే నియమించారు. పెండింగ్ లో ఉన్న పటాన్ చెరు ఏఎంసీ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్ష శ్యామ్ రావు పేరును ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకించిన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తన అనుచరుడు శివానందానికి ఆ పోస్ట్ ఇవ్వాలని హైకమాండ్‌కు విన్నవించారు.
ఒకే పోస్టుకు ఇద్దరు నేతల నుంచి ప్రతిపాదనలు రావడంతో ఆ నియామకాన్ని ఎటు తేల్చకుండానే పెండింగ్ లో పెట్టారు. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ తోపాటు డైరెక్టర్ పదవులను తన అనుచరులకు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎంపీ సురేశ్ షెట్కార్ వర్గీయులు కూడా అవే పోస్టులకు పోటీ పడడంతో ఎటు తేలకుండా భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికైనా నాయకులు సమన్వయంతో ఆయా పదవులను భర్తీ చేయాలని ఆశావాహులు కోరుతున్నారు
