- ప్రభుత్వ ప్రాధాన్య పనుల్లో వేగం పెంచాలి: సీఎస్ రామకృష్ణా రావు
- సెక్రటేరియెట్‌లో వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని సీఎస్ రామకృష్ణారావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం సెక్రటేరియెట్‌లో రెవెన్యూ, దేవాదాయ, పర్యాటక, రవాణ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించకూడదని, ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.
ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆదేశించారు. గోదావరి తీరంలో దాదాపు 69 ప్రాంతాల్లో 74 పుష్కర ఘాట్లను గుర్తించినట్లు అధికారులు సీఎస్‌కు వివరించగా, ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఇతర మౌలిక వసతుల కల్పనపై తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు.
మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిపై సీఎస్ సమీక్షించారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా కళాకారులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇక క్రీడారంగంపై సమీక్షిస్తూ.. రాబోయే 2036 ఒలింపిక్స్ నాటికి రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
'తెలంగాణ రైజింగ్ 2047'లో భాగంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువతను క్రీడల వైపు ఆకర్షించేలా పటిష్టమైన విధానాలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల సౌకర్యార్థం ‘సీఎం కప్ వాట్సాప్ యాప్’ ను సీఎస్ ఆవిష్కరించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, చారిత్రక ప్రదేశాల వైపు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
