రాజ్యాంగమే మూలస్తంభం.. అదే మన దేశ ఐడెంటిటీ : ద్రౌపది ముర్ము

రాజ్యాంగమే మూలస్తంభం.. అదే మన దేశ ఐడెంటిటీ : ద్రౌపది ముర్ము
  • మనల్ని ముందుకు నడిపించే మార్గదర్శి అని వెల్లడి 
  • సంవిధాన్ సదన్‌‌‌‌లో రాజ్యాంగ దినోత్సవం

న్యూఢిల్లీ: మన దేశ ఐడెంటిటీకి రాజ్యాంగం మూలస్తంభమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘‘రాజ్యాంగం మన దేశానికి గర్వకారణమైన డాక్యుమెంట్. ఇది మన దేశ గుర్తింపుకు ప్రతీక. వలసవాద మనస్తత్వాన్ని విడిచిపెట్టి, జాతీయవాద భావనతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించే మార్గదర్శి” అని పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్ పాత బిల్డింగ్‌‌లో (సంవిధాన్ సదన్) రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్ద కాలంలో పార్లమెంట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నదని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ, కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకురావడం లాంటి డెసిషన్స్ తీసుకున్నదని గుర్తు చేశారు. ‘‘25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది మన దేశం సాధించిన గొప్ప విజయం. ఎస్సీ, ఎస్టీలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు, మహిళలు, యువత... ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతున్నది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆవతరించే దిశగా భారత్ పరుగులు పెడుతున్నది” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు, లోక్‌‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సహా 
అందరూ రాజ్యాంగ పీఠికను చదివారు.

వికసిత్ భారత్‌‌కు స్ఫూర్తి: మోదీ 

రాజ్యాంగ విలువలను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘‘వికసిత్ భారత్‌‌ను సాధించడానికి రాజ్యాంగం మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. మన రాజ్యాంగం హ్యూమన్ డిగ్నిటీ, సమానత్వం, స్వేచ్ఛకు ప్రాముఖ్యం ఇస్తుంది. రాజ్యాంగం మనకు హక్కులతో పాటు కొన్ని విధులనూ అప్పగించింది. ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ విధులే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది” అని సోషల్ మీడియా ‘ఎక్స్‌‌’లో పేర్కొన్నారు.