ఢిల్లీ మెట్రోలో ప్రెసిడెంట్ జర్నీ

ఢిల్లీ మెట్రోలో ప్రెసిడెంట్ జర్నీ
  • ప్రయాణిస్తూ స్టూడెంట్లతో మాట్లాడుతున్న వీడియో వైరల్
  • మెట్రోలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా రికార్డు

న్యూఢిల్లీ: ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. అందులో ప్రయాణిస్తున్న స్కూల్ స్టూడెంట్ల పక్కన కూర్చుని వాళ్లతో మాట్లాడారు. వాళ్ల కెరీర్ ప్లాన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము మెట్రోలో ప్రయాణించడం ఇదే తొలిసారి కాగా, ప్రతిభా పాటిల్ తర్వాత మెట్రోలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 2012లో ప్రతిభా పాటిల్ మెట్రోలో ప్రయాణం చేశారు. ‘‘ప్రెసిడెంట్ ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్​ దగ్గరలోని సెంట్రల్ సెక్రటేరియెట్ మెట్రో స్టేషన్​కు వెళ్లారు. అక్కడి సౌలత్​ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అపై మెట్రోలో ప్రయాణించారు. స్కూల్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు. నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్​దాకా వెళ్లి.. తిరిగి సెంట్రల్ సెక్రటేరియెట్​కు మెట్రోలోనే వచ్చారు” అని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందని, ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఢిల్లీ మెట్రో పనితీరు దేశం గర్వించేలా ఉందని మెట్రో స్టేషన్​ విజిటర్స్ పుస్తకంలో ప్రెసిడెంట్ రాశారు.