అల్లూరి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: రాష్ట్రపతి

అల్లూరి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: రాష్ట్రపతి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశభక్తి అసమానమైనదన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో  జరిగింది. ఈ కార్యక్రమానికి ముర్ము చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని, స్మృతి వనాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. నేతాజీ పోరాటం లాగే..అల్లూరి సీతారామరాజు పోరాటం ప్రజల్లో స్ఫూర్తిని నింపిందన్నారు ముర్ము. మహనీయుల చరిత్ర  భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలన్నారు. 

మన్యం వీరుడి పోరాటం అసాధారణం:తమిళి సై

గొప్ప త్యాగలతోనే గొప్ప విజయాలు నమోదవుతాయన్నారు గవర్నర్ తమిళిసై. మన్యం వీరుడి పోరాటం అసాధారణమైనదన్నారు. అమృత్ కాల్ లో ఈ వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు. అమరుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ఓ జాతికోసం అల్లూరి పోరాడలేదని.. దేశం కోసం ఆయన పోరాడారని చెప్పారు.ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టిన అల్లూరిని మనం మర్చిపోవద్దని చెప్పారు తమిళిసై.

బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిండు: కేసీఆర్

అల్లూరి జయంతి ఉత్సవాలు కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేస్తాయన్నారు సీఎం కేసీఆర్. బ్రిటీష్ కబంధహస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేసిన మన్యం వీరుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి గొప్పతనం..పోరాటం ముందు తరలాలకు తెలియాలన్నారు. అల్లూరిని దైవాంశసంభూతుడని అన్న సీఎం..26ఏండ్ల వయసులోనే బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారని అన్నారు. తెలుగుజాతి గర్వించే ముద్దు బిడ్డ అల్లూరి సీతారామరాజు అని తెలిపారు.

క్షత్రియ వీరుడు అల్లూరి: కిషన్ రెడ్డి

ఒకే వర్గానికి పరిమితమైన వ్యక్తి అల్లూరి కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సూర్యచంద్రులు ఉన్నంతవరకు విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి వీరుడు మాత్రమే కాదని.. వైద్యుడు, ఆధ్యాత్మిక వేత్త కూడా అని చెప్పారు. 125వ జయంతి వేళ...దేశం మొత్తం నివాళి అర్పిస్తుందన్నారు కిషన్ రెడ్డి.