భూములు గుంజుకుని బీఆర్ఎస్ ఆగం చేసింది..అవుట్సోర్సింగ్ ఉద్యోగాలిచ్చి ఆదుకోండి

భూములు గుంజుకుని బీఆర్ఎస్ ఆగం చేసింది..అవుట్సోర్సింగ్ ఉద్యోగాలిచ్చి ఆదుకోండి
  • యాదగిరిగుట్ట భూనిర్వాసితుల వేడుకోలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను ప్రభుత్వానికి ఇచ్చి ఉపాధి కోల్పోయామని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై లేదా కింద తమకు షాపులు కేటాయించి, ఆలయంలో అవుట్‌‌సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. 

సోమవారం హైదరాబాద్‌‌లో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలయ అభివృద్ధి కోసం అప్పటి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు యాదగిరికొండ ఉత్తర దిశలో ఉన్న సుమారు 100 ఎకరాల వ్యవసాయ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. కానీ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఉపాధి కల్పించలేదని చెప్పారు. తక్కువ నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని వాపోయారు. కార్యక్రమంలో భూనిర్వాసితులు బూడిద సురేందర్, నాగరాజు, దేవమ్మ, పద్మ, నరసింహ, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.