
అమేథీ(యూపీ): హిందువు, హిందుత్వవాది అంశంపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మరోసా రి కామెంట్లు చేశారు. కేంద్రం, ప్రధాని మోడీపై విమర్శలు చేశారు. దేశంలో ధరలు పెరగడానికి, జనాలకు బాధ, విచారం కలగడానికి హిందుత్వవాదులే కారణమని అన్నారు. ‘‘ఇప్పుడు హిందువులు, హిందుత్వవాదుల మధ్యే యుద్ధం జరుగుతోంది. హిందువులు సత్యాన్ని నమ్ముకుంటే, హిందుత్వవాదులు రాజకీయాలను నమ్ముకున్నారు” అని విమర్శించారు. ‘‘హిందువులు సత్య మార్గంలోనే నడుస్తారు. హిందువు భయాలకు లొంగిపోడు.. వాటిని ఎదుర్కొంటాడు. తన భయాన్ని కోపం, ద్వేషం రూపంలో ఎప్పుడూ చూపెట్టడు. దీనికి మహాత్మాగాంధీనే బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ హిందుత్వవాదులు పవర్లో ఉండేందుకు అబద్ధాలు చెబుతారు” అని అన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా శనివారం ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. అమేథీలో ఏమీ మారలేదని, ప్రభుత్వంపై ప్రజల్లో కోపం కనిపిస్తోందని రాహుల్ అన్నారు. ‘‘ఇప్పుడు ధరల పెరుగుదల, నిరుద్యోగం అతిపెద్ద సమస్యలు. కానీ ప్రధాని గానీ, సీఎం గానీ వీటికి సమాధానం చెప్పడం లేదు. ఇటీవల మోడీ వచ్చి గంగా నదిలో మునిగి వెళ్లిపోయిండు. కానీ నిరుద్యోగం గురించి మాట్లాడలేదు” అని
రాహుల్ గాంధీ విమర్శించారు.