హైదరాబాద్, వెలుగు: చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ రంజాన్‌మాసంలో మత సామరస్యాన్ని చాటారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేసేందుకు కులం, మతం అడ్డురాదని తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. చిలుకూరుకు చెందిన రైతు మొహమ్మద్గౌస్ కు చెందిన ఎద్దు ఇటీవల కరెంట్ షాక్‌తో చనిపోయింది. విషయం తెలుసుకున్న అర్చకుడు సీఎస్రంగరాజన్.. మంగళవారం రైతు మొహమ్మద్గౌస్కు ఎద్దును అందజేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆవులు, గేదెలు, ఎద్దులను రైతులు కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని, వాటికి ఏమైనా విలవిలలాడిపోతారన్నారు. ప్రమాదవశాత్తు అవి చనిపోతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారని చెప్పారు. గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సాయంతో రైతుకు ఎద్దును అందజేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్న రైతులకు పశువులను బహుమతిగా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని రంగరాజన్ పిలుపునిచ్చారు.
