ఎముకలు కొరికే చలి..29జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు

ఎముకలు కొరికే చలి..29జిల్లాల్లో  సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
  • 29 జిల్లాల్లో సింగిల్​ డిజిట్..4 జిల్లాల్లో 10 డిగ్రీలే
  • ఈ సీజన్​లోనే అత్యల్పంగా సంగారెడ్డిలోని కోహీర్​లో 4.5 డిగ్రీలు
  • ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో 4.8 డిగ్రీలు నమోదు
  • హైదరాబాద్​లోనూ ముదిరిన చలి.. మరో మూడ్రోజులు అలర్ట్​
  • రాష్ట్రంలో భారీగా పడిపోతున్నరాత్రి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, వెలుగు: కోల్డ్​ వేవ్ 2.0లో రాష్ట్రం వణికిపోతున్నది. పొద్దుమాపు అన్న తేడా లేకుండా రోజంతా చలి పెడుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. నాలుగు జిల్లాలు తప్ప రాష్ట్రమంతటా సింగిల్​ డిజిట్​ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్​లో 4.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

ఇది ఈ సీజన్​లోనే అత్యల్ప ఉష్ణోగ్రత. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో 4.8 డిగ్రీలు రికార్డ్​ అయింది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 5.1, వికారాబాద్​ జిల్లా మోమిన్​పేటలో 5.8, ఆదిలాబాద్​ జిల్లా అర్లిటిలో 5.9 డిగ్రీల మేర నైట్​ టెంపరేచర్లు రికార్డయ్యాయి. 29 జిల్లాల్లో సింగిల్​ డిజిట్​ టెంపరేచర్లు నమోదవగా.. మిగతా నాలుగు జిల్లాల్లోనూ 10 డిగ్రీల రేంజ్​లోనే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. 

రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లో 7 డిగ్రీల రేంజ్​లో, 11 జిల్లాల్లో 8 డిగ్రీలు, 9 జిల్లాల్లో 9 డిగ్రీల రేంజ్​లో ఉష్ణోగ్రతలు రికార్డ్​ అవ్వడం చలి తీవ్రత ఎంతలా ఉందో తెలియజేస్తున్నది. రాబోయే మూడు రోజులు టెంపరేచర్లు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

హైదరాబాద్​లోనూ అంతే తీవ్రం

హైదరాబాద్​ సిటీ పరిధిలోనూ చలి తీవ్రంగా ఉంటున్నది. హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ పరిధిలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్​లో 7.4, మౌలాలిలో 7.5, శివరాంపల్లిలో 8.4, గచ్చిబౌలిలో 8.4, మచ్చబొల్లారంలో 9.4, రాజేంద్రనగర్​ జీహెచ్​ఎంసీ ఆఫీస్​ వద్ద 9.7, వెస్ట్​మారేడ్​పల్లిలో 10 డిగ్రీల మేర నైట్​ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హైదరాబాద్​ సిటీ శివార్లతో పాటు జిల్లాలు, ఏజెన్సీ ఏరియాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువైంది. 

పెరిగిన చలి, మంచు ప్రభావంతో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆస్తమా, ఉబ్బసం, శ్వాస సంబంధిత సమస్యలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అడ్వయిజరీ రిలీజ్​ చేసింది.

ప్రయాణాల్లో జాగ్రత్త..!

పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున, రాత్రి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా వెళ్లాలని ట్రాఫిక్​ పోలీసులు అలర్ట్స్​ ఇచ్చారు. వీలైతే రాత్రి ప్రయాణాలు, తెల్లవారుజామున ప్రయాణాలను పోస్ట్​పోన్​ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ అర్జెంట్​గా వెళ్లాల్సి వస్తే మాత్రం పొగమంచులో 40 కిలోమీటర్లకు మించి వేగంగా వాహనాలను నడపొద్దంటున్నారు. 

పొగమంచులో విజిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి.. కారు ఫాగ్​ లైట్స్​, హజార్డ్​ (పార్కింగ్​) లైట్స్​ ఆన్​ చేసుకుని డ్రైవ్​ చేయాలని చెప్తున్నారు. ముందుండే వాహనాలకు కనీస దూరం పాటిస్తే ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది.