తాడ్ బండ్.. స్కూల్ స్థలం మాది

తాడ్ బండ్.. స్కూల్ స్థలం మాది

కంటోన్మెంట్, వెలుగు:  గత 50 ఏండ్లుగా వేలాది మంది స్టూడెంట్లకు విద్యనందించిన కంటోన్మెంట్ తాడ్​బండ్​లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం భూ వివాదంలో చిక్కుకుంది. సమ్మర్​హాలిడేస్​లో స్కూల్ గేటుకు తాళాలు వేసిన కంటోన్మెంట్ అధికారులు.. తాజాగా స్కూల్ స్థలం తమది అంటూ అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్కూల్​స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. దీంతో ప్రస్తుతం స్కూల్​లో చదువుకుంటున్న తమ పిల్లల పరిస్థితి ఏమిటోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అర్ధ శతాబ్ద కాలంగా ఈ స్కూల్​తోపాటు, స్కూల్ ఆవరణలోని స్థలాన్ని కాపాడుతూ వచ్చామని, తమకే సర్వహక్కులు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఫలించని ప్రయత్నాలు

తాడ్ బండ్​లోని ఎకరం స్థలంలో ప్రాథమిక పాఠశాల ఉంది. కరోనాకు ముందు 60 మంది స్టూడెంట్లతో నడిచిన ఈ స్కూల్​లో ప్రస్తుతం 20 మంది చదువుకుంటున్నారు. దీంతో కంటోన్మెంట్ అధికారులు, రాష్ట్ర పోలీస్ విభాగం ఈ స్కూల్​ను మరో చోటకు తరలించి కోట్ల విలువ చేసే స్కూల్​స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాయి. తాడ్​బండ్​ఏరియాకు కొత్త పోలీస్​స్టేషన్​మంజూరు కాగా.. దాని ఏర్పాటుకు ఆ స్కూల్​స్థలాన్ని పరిశీలించారు. పీఎస్​నిర్మాణానికి అనువైనదిగా భావించిన పోలీసులు తమకు కేటాయించాలని కంటోన్మెంట్ బోర్డు, విద్యాశాఖ అధికారులను సంప్రదించారు. అయితే ఆ స్కూల్​ను అప్​గ్రేడ్​చేస్తామని, ఆ స్థలాన్ని ఎవరికీ ఇవ్వబోమంటూ విద్యాశాఖ స్పష్టం చేయడంతో పోలీసులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. 

సామగ్రిని భద్రపరుస్తూ..

కానీ పట్టు వదలని కంటోన్మెంట్​బోర్డు అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆ స్కూల్​టీచర్లు చెబుతున్నారు. కొంతకాలంగా స్కూల్ ఆవరణలో ఇంజనీరింగ్​విభాగానికి చెందిన సామగ్రిని భద్రపరుస్తున్నారని, తద్వారా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని పేర్కొంటున్నారు.  వేసవి సెలవుల్లో స్కూల్​మూవేసి గేటుకు తాళాలు వేసుకుని టీచర్లు వెళ్లిపోగా.. ఈనెల12న స్కూళ్లు ప్రారంభం కావడంతో టీచర్లు, స్టూడెంట్లు స్కూల్​కు రాగా గేటుకు వేరే తాళం వేసి ఉంది. కంటోన్మెంట్ అధికారులే​ఈ పని చేసినట్లుగా గుర్తించిన టీచర్లు.. వారిని సంప్రదించగా స్కూల్​స్థలం తమ ఆధీనంలో ఉందని, తాళాలు తీయబోమని స్పష్టం చేశారు. టీచర్లు పోలీసులకు కంప్లైంట్​చేయడంతో దిగి వచ్చిన బోర్డు అధికారులు వెంటనే వచ్చి గేటు తాళం తీశారు.

స్కూల్ నడిపేందుకు పర్మిషన్ ఇవ్వలేదు

అయితే, సమస్య సద్దుమణిగిందని భావిస్తున్న టైంలో ఇటీవల కంటోన్మెంట్​బోర్డు సీఈఓ మధుకర్​నాయక్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్​ విభాగానికి చెందినహైలెవెల్ కమిటీ బృందం​స్కూల్​ను సందర్శించింది. ఈ స్థలంపై పూర్తి హక్కులు కంటోన్మెంట్​బోర్డుకే ఉన్నాయని, ఇక్కడ స్కూల్​ను నడిపేందుకు విద్యాశాఖ అధికారులు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపింది. అందుకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని, ఏమైనా ఉంటే చూపించాలని కోరింది. త్వరలోనే విద్యాశాఖ అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పింది. స్కూల్​ స్థలం తమదేనని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన బోర్డు అధికారులు.. స్కూల్​నడిపేందుకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని వెల్లడించారు.

స్టూడెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి

బస్తీల్లోని నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్​లోనే చదివిస్తున్నారు. స్కూల్​స్థలాన్ని కంటోన్మెంట్​బోర్డు స్వాధీనం చేసుకుంటే పేద పిల్లలకు విద్య దూరమయ్యే ప్రమాదముంది. స్కూల్ నిర్వహణకు బోర్డు అధికారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. ఆ స్థలాన్ని స్కూల్​కే కేటాయించాలి.

– షడ్రక్, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి