13 స్కీంలకు ఒకే పోర్టల్

13 స్కీంలకు ఒకే పోర్టల్

న్యూఢిల్లీ: గతంలో ప్రభుత్వం కేంద్రంగా పరిపాలన సాగేదని, ఇప్పుడు ప్రజలు కేంద్రంగా పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 13 క్రెడిట్ స్కీంలను ప్రజలు ఈజీగా వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ‘జన్ సమర్థ్’ పోర్టల్ ను ప్రధాని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎండ్ టు ఎండ్ డెలివరీ’ విధానంతో తీసుకొచ్చిన జన్ సమర్థ్ పోర్టల్ తో ఆయా స్కీంలను ఉపయోగించుకోవడం మరింత ఈజీ అవుతుందన్నారు. ఈ పోర్టల్ ద్వారా లోన్ లు పొందేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తారని ఆకాంక్షించారు. ‘‘ఇంతకుముందు ప్రభుత్వ స్కీంల ప్రయోజనాలను పొందాలంటే ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు ప్రజల వద్దకే పాలనను తీసుకుపోతున్నాం. వివిధ మినిస్ట్రీల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అనేక వెబ్ సైట్ లనూ చూడాల్సిన అవసరంలేదు. ఇప్పుడు ఒకే పోర్టల్ లో 13 క్రెడిట్ స్కీంలను పొందొచ్చు. స్టూడెంట్లు, రైతులు, వ్యాపారులు, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్ల కలల సాకారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

రోజూ 12 కొత్త స్టార్టప్​లు.. 
గత 8 ఏండ్లలో యువతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఎన్నో రిఫార్మ్స్ తెచ్చామని మోడీ చెప్పారు. కంపెనీల అభివృద్ధి కోసం కంపెనీల చట్టంలోనూ మార్పులు తెచ్చామన్నారు. దేశంలో రోజూ 12 కొత్త స్టార్టప్​లు వస్తున్నాయని, దేశంలో మొత్తం 70 వేల స్టార్టప్​లు ఉన్నాయన్నారు. గవర్నమెంట్ ఇ-–మార్కెట్ ప్లేస్(జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రొక్యూర్ మెంట్, సెల్లింగ్ చాలా సులభం అయిందని, ఈ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు రూ. లక్ష కోట్లు దాటాయన్నారు. జన్ సమర్థ్ పోర్టల్​లో 13 స్కీంలు అందుబాటులో ఉంటాయని, ప్రతి స్కీం గురించీ పూర్తి వివరాలు తెలుసుకుని, ఉపయోగించుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.