ఉక్రెయిన్​లో హింసను ఆపండి

ఉక్రెయిన్​లో హింసను ఆపండి
  • ఉక్రెయిన్​లో హింసను ఆపండి
  • రష్యా ప్రెసిడెంట్ పుతిన్​కు ప్రధాని మోడీ ఫోన్ 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో వెంటనే హింసకు ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఇండియా వెంటనే జోక్యం చేసుకోవాలని, రష్యా ప్రెసిడెంట్ తో ప్రధాని మోడీ మాట్లాడాలంటూ ఉక్రెయిన్ అంబాసిడర్ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తర్వాత పుతిన్ కు మోడీ ఫోన్ చేశారు. ‘‘ఉక్రెయిన్ లో వెంటనే హింసకు ముగింపు పలకాలి. అందరూ సమష్టి ప్రయత్నాలతో దౌత్యపరమైన సంప్రదింపులు, చర్చలను తిరిగి ప్రారంభించాలి. రష్యా, నాటో గ్రూపు మధ్య దీర్ఘకాలికంగా ఉన్న విభేదాలు నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయి” అని మోడీ ఈ సందర్భంగా సూచించారని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ వివాదానికి సంబంధించి ఇటీవలి విషయాలను మోడీకి పుతిన్ వివరించారని తెలిపింది. అలాగే ఉక్రెయిన్ లో ఉన్న ఇండియన్ స్టూడెంట్లు, పౌరుల భద్రతపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని సేఫ్ గా తిరిగి వచ్చేలా చూడాలని కోరారు. రెండు దేశాల అధికారులు, దౌత్య బృందాలు రెగ్యులర్ గా టచ్ లో ఉండాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు నిర్ణయించారు.