నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరూ కదలించలేరు: మోదీ

నేను బతికున్నంత వరకు  రాజ్యాంగాన్ని ఎవరూ కదలించలేరు: మోదీ

తాను బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్నిఎవరూ కదిలించలేరన్నారు  ప్రధాని నరేంద్ర మోదీ. జహిరాబాద్ సభలో మాట్లాడిన మోదీ.. బీజేపీ అధికారంలోకి వస్తే రిజ్వేషన్లు రద్దు చేస్తుందన్న వ్యాఖ్యలకు  కౌంటర్ ఇచ్చారు. తాను బతికి ఉన్నంత వరకు దళితులు, ఓబీసీలకు అన్యాయం జరగనియ్యబోనని చెప్పారు. ముస్లీం రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తే లేదన్నారు. రిజర్వేషన్లపై ఫేక్ వీడియోలు రిలీజ్ చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు మోదీ.  కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెడతామన్నారు.  తమకు రాజ్యాంగమే ధర్మ గ్రంథమని.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు  రాజ్యాంగాన్ని అంబారీపై ఊరేగించానని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక 75 స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. 

కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లు తీసేసి ముస్లీంలకు ఇచ్చిందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ మళ్లీ పాతరోజులను తేవాలని చూస్తుంది. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది. కానీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తాం. లింగాయత్ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కానీ..ముస్లీం రిజర్వేషన్లకు అనుకూలం. రాజ్యాంగంపై కాంగ్రెస్ కు మొదటి నుంచి చిన్నచూపే.  ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ దే.  నెహ్రూ, ఇందిర రాజ్యాంగాన్ని పదే పదే అవమానించారు.  కాంగ్రెస్ నేతలు రాజకీయ అవసరాలకు రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు మోదీ.  

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను వేస్తుందన్నారు ప్రధాని మోదీ.  మీరు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులపై కాంగ్రెస్ కన్నేసిందన్నారు . వారసత్వ ఆస్తులపై 55 శాతం పన్ను వేసేందుకు   కాంగ్రెస్ కుట్రచేస్తోందని ఆరోపించారు.  మీ ఆస్తులను మీ పిల్లలకు కాకుండా చేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. 

రాష్ట్రంలో ఇపుడు ఆర్ఆర్ ట్యాక్స్ పై చర్చ జరుగుతోందన్నారు మోదీ.  ఆర్ ఆర్ ట్యాక్స్ గురించి ఆలోచించకుంటే ఐదేళ్లలో ఆగమైతని అన్నారు.  ఆర్ఆర్  అంటే ఎవరో  మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ తో వ్యాపార వేత్తలు ఇప్పటికే నష్టపోయారని చెప్పారు.  కాంగ్రెస్ వారసత్వ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మోదీ.

 బీఆర్ఎస్ అవినీతి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తెలిసిపోతుందన్నారు మోదీ. లిక్కర్ స్కామ్ లో బీఆర్ ఎస్ నేతలు ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న ఆప్ తో కాంగ్రెస్ పొత్తులో ఉంది. గతంలో ఓటుకు నోటు కేసును బీఆర్ఎస్ తొక్కిపెట్టింది. ఇపుడు కాళేశ్వరం అవినీతిని కాంగ్రెస్ తొక్కి పెడుతోంది. కాంగ్రెస్ రైతు రుణమాఫీ వరిపై రూ. 500 బోనస్ ఏమైంది? మళ్లీ పాతరోజులను తేవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. గతంలో బీఆర్ఎస్, ఇపుడు కాంగ్రెస్ తెలంగాణను దోచుకుంటున్నాయి.  తెలంగాణలో అవినీతి అంతం కావాలంటే బీజేపీ రావాల్సిందేని మోదీ చెప్పారు.