ప్రతి రంగంలోనూ నారీశక్తి ముందంజ : ప్రధాని మోదీ

ప్రతి రంగంలోనూ నారీశక్తి ముందంజ : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశంలో ప్రతి రంగంలోనూ నారీ శక్తి కొత్త శిఖరాలకు చేరుతోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళా శక్తి పాత్రకు సెల్యూట్ చేసేందుకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక మంచి సందర్భమన్నారు. మోదీ తన మన్ కీ బాత్ రేడియో ప్రసంగం 110వ ఎడిషన్ లో ఆదివారం మాట్లాడారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే ప్రపంచం సుసంపన్నం అవుతుందని ప్రఖ్యాత కవి భారతీయార్ చెప్పిన మాటలను ప్రధాని గుర్తుచేశారు. 

గ్రామాల్లోని మహిళలు సైతం డ్రోన్లను వినియోగిస్తారని కొన్నేండ్ల కిందటి వరకూ అనుకోలేదని.. కానీ ఇప్పుడు నమో డ్రోన్ దీదీ కార్యక్రమం వల్ల అది సాకారం అయిందన్నారు. ఈ సందర్భంగా యూపీకి చెందిన డ్రోన్ దీదీ సునీతతో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్న కల్యాణి ప్రఫుల్లా పాటిల్​తో కూడా ప్రధాని ముచ్చటించారు. 

ఒడిశాలో గోట్ బ్యాంక్ భేష్.. 

‘గోట్ బ్యాంక్’ పేరుతో మేకల పెంపకంలో వినూత్న పద్ధతిని ప్రారంభించిన ఒడిశా మహిళ జయంతి మహాపాత్ర, ఆమె భర్త బీరేన్ సాహును మోదీ అభినందించారు. కమ్యూనిటీ స్థాయిలో మేకల పెంపకం చేపట్టడం ద్వారా గ్రామస్తులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతుందని ఆయన ప్రశంసించారు. బెంగళూరులో మేనేజ్ మెంట్ ప్రొఫెషనల్స్​గా ఉన్న వారు తమ ఉద్యోగాలను వదిలి కలహండిలోని సలేభట గ్రామానికి వచ్చి గోట్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమన్నారు. 

ఈ గోట్ బ్యాంకులో ప్రస్తుతం 50 గ్రామాలకు చెందిన వెయ్యి మంది రైతులు సభ్యులుగా చేరారని తెలిపారు. కాగా, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల పాటు మన్ కీ బాత్ ప్రోగ్రాంకు విరామం ఇవ్వనున్నట్లు మోదీ వెల్లడించారు. ఎన్నికల తర్వాత తిరిగి 111వ ఎపిసోడ్ మన్ కీ బాత్ లో కలుసుకుందామని చెప్పారు.