ఉక్రెయిన్ క్రైసిస్: మరోసారి ప్రధాని మోడీ సమీక్ష

ఉక్రెయిన్ క్రైసిస్: మరోసారి ప్రధాని మోడీ సమీక్ష

ఉక్రెయిన్ పై రష్యా దాడులు, ఉద్రిక్త పరిస్థితులు, మన విద్యార్థుల తరలింపు అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జై శంకర్, పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ పరిస్థితులను వారు.. ప్రధాని మోడీకి వివరించారు. భారత విద్యార్థుల తరలింపు ప్రక్రియ, ఆపరేషన్ గంగ కార్యక్రమంపై చర్చించిన ప్రధాని మోడీ.. వీలైనంత త్వరగా మన వాళ్లందరినీ స్వస్థలాలకు చేర్చాలని ఆదేశించారు. ఇందుకోసం వీలున్న ఏ ఒక్క మార్గాన్నీ విడిచిపెట్టొద్దని చెప్పారు.

మరోవైపు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ సిటీపై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో అక్కడి భారతీయులకు పలు సూచనలు చేసింది రక్షణశాఖ. అత్యవసర పరిస్థితుల్లో సంకేంతంగా చూపించేందుకు భారతీయ బృందాలు తప్పనిసరిగా వైట్ క్లాత్ ఉంచుకోవాలని తెలిపింది. ఫుడ్, వాటర్ ని సేవ్ చేసుకోవాలంది. ఆహార నిల్వలు ఎక్కువరోజులు ఉండేలా జాగ్రపడాలని సూచనలు చేసింది.