నెక్స్ట్ ఫోకస్.. డీప్ టెక్ స్టార్టప్!..వచ్చే 10 ఏండ్లు ఎంతో కీలకం : ప్రధాని మోదీ

నెక్స్ట్ ఫోకస్.. డీప్ టెక్ స్టార్టప్!..వచ్చే 10 ఏండ్లు ఎంతో కీలకం : ప్రధాని మోదీ
  • గ్లోబల్ లీడర్​గా అవతరించాలి
  • స్టార్టప్ ఇండియా 10వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: వచ్చే 10 ఏండ్లలో డీప్ టెక్, గ్లోబల్ లీడర్‌షిప్‌పై స్టార్టప్‌లు దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే దశాబ్దం ఇండియాకు ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం నిర్వహించిన స్టార్టప్ ఇండియా 10వ వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. స్టార్టప్‌లు కేవలం సర్వీస్ రంగంపైనే కాకుండా.. ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష సాంకేతికత వంటి ‘డీప్ టెక్’ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. 

‘‘వచ్చే పదేండ్లలో ఇండియా స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కేవలం దేశీయ అవసరాలకే కాకుండా, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపే స్థాయికి ఎదగాలి. గ్లోబల్ లీడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అవతరించాలి. ఇండియాలో తయారైన ఉత్పత్తులు.. సాంకేతికత వ్యవస్థలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ కలిగి ఉండాలి. డీప్ టెక్ రంగంలో పరిశోధనలు చేసే వారికి నిధులు, మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొస్తున్నది. రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ కోసం బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నాం. స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు డీప్ టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దృష్టి పెడితే, ఇండియా ఇతర దేశాల నుంచి టెక్నాలజీని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. 

ఇండియన్ స్టార్టప్​లు కేవలం సేవారంగం పైనే కాకుండా, మ్యానుఫాక్చరింగ్, డీప్ టెక్నాలజీ, గ్లోబల్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ పై దృష్టి సారించాలి. 2014లో దేశంలో 500 కంటే తక్కువ స్టార్టప్​లు ఉన్నాయి. ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉన్నాయి. ఇది ఒక గొప్ప స్టార్టప్ విప్లవం’’ అని ప్రధాని మోదీ కొనియాడారు. దేశంలో యూనికార్న్​ల సంఖ్య 4 నుంచి 125కి చేరుకున్నాయని తెలిపారు. ఒకప్పుడు రిస్క్ తీసుకోవడం అంటే భయపడేవారని, కానీ.. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం ఒక ట్రెండ్​గా మారిందని చెప్పారు. ఉద్యోగాల కోసం వెతకడం కాకుండా, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి మన యువత ఎదిగారని ప్రశంసించారు.