ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ లో కొత్త శకం: మోడీ

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ లో కొత్త శకం: మోడీ

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లఢక్ లో కొత్త శకం మొదలైందన్నారు ప్రధాని మోడీ. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ ఆర్టికల్ 370 రద్దుతో అంబేద్కర్ ,సర్దార్ పటేల్, శ్యామాప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో  ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి తాము చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒకటే భారత్‌.. ఒకటే రాజ్యాంగం కల సాకారమైందన్నారు. కశ్మీర్ లో వేర్పాటు వాదం, ఉగ్రవాదం, కుటుంబ పాలన పెరిగిపోయిందని.. వీటన్నింటిని తొలగించడానికి ఓ ఆయుధంలా ప్రయోగించామన్నారు.

జమ్ముకశ్మీర్‌ కొంతకాలం పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచి.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరపాలని అనుకొంటున్నట్లు చెప్పారు మోడీ. కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడితే సినిమా షూటింగ్ ల కోసం అక్కడకు చాలా మంది వెళ్తారని అన్నారు. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ లో 42 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆర్టికల్ 370 పై చాలా చర్చ జరిగిందని.. ఇన్ని రోజులు పార్లమెంట్  ఎన్ని చట్టాలు చేసినా కశ్మీర్  కు వర్తించలేదన్నారు మోడీ.