హైదరాబాద్​లో 2 గంటలే ప్రధాని టూర్

హైదరాబాద్​లో 2 గంటలే ప్రధాని టూర్

హైదరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ టూర్ అధికారిక షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఆయన రెండు గంటలు సిటీలో ఉండనున్నారు. శనివారం ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక విమానంలో  బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. మోడీ ఉదయం 11:35 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11:45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం 12:05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి 12:15 గంటలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. ఇక్కడ పబ్లిక్ మీటింగ్ లో ఆరు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు పథకాలను జాతికి అంకితం చేస్తారు. అనంతరం 12:50 గంటల నుంచి 1:20 గంటల వరకు అరగంట పాటు మీటింగ్ లో మాట్లాడతారు. కాగా, ఈ సభలో సీఎం కేసీఆర్ కు కూడా మాట్లాడే అవకాశం కల్పించారు. 12:30 గంటల నుంచి 12:37 వరకు ఆయనకు సమయం కేటాయించారు. 

కేసీఆర్​కు ఆహ్వానం..  

కొంతకాలంగా రాష్ట్రంలో మోడీ అధికారిక పర్యటనలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ఈసారి కూడా ఆయన రాకపోవచ్చని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మోడీ హైదరాబాద్ టూర్ అధికారిక ప్రోగ్రామ్ అయినందున ప్రొటోకాల్ ప్రకారం కేసీఆర్​కు ఆహ్వానం పంపామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా ఎలా ఉన్నా, అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్ పాలుపంచుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. కాగా, సంజయ్ అరెస్టయిన సమయంలో ప్రధాని నగరానికి రానుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సభలో మోడీ ఏం మాట్లాడతారనే దానిపై బీజేపీతో పాటు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

జనసమీకరణపై బీజేపీ ఫోకస్..

మోడీ పరేడ్ గ్రౌండ్ సభను విజయవంతం చేసేందుకు స్టేట్ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. జన సమీకరణపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ సిటీతో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జన సమీకరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే​సిటీ బీజేపీ నేతలతో, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. జనాన్ని తరలించేందుకు వెయ్యి బస్సులను సిద్ధం చేశారు. రైల్వే కనెక్టివిటీ ఉన్నోళ్లు రైళ్ల ద్వారా హైదరాబాద్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.