దేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల కీర్తిని మళ్లీ చాటుతున్నాం : ప్రధాని

దేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల కీర్తిని మళ్లీ చాటుతున్నాం : ప్రధాని

ఉజ్జయిన్ : దేశానికి వేల ఏండ్లుగా ఉజ్జయిని పుణ్యక్షేత్రమే మార్గదర్శిలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉజ్జయిని​లో అణువణువునా ఆధ్యాత్మికత, దైవశక్తి నిండి ఉందన్నారు. దేశ శ్రేయస్సు, జ్ఞానం, గౌరవం, సాహిత్యం వంటి అంశాల్లో ఇండియాను వేల ఏండ్లుగా ఉజ్జయినే నడిపించిందని చెప్పారు. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని లో ప్రఖ్యాత మహాకాళేశ్వర టెంపుల్ వద్ద అనేక సౌలతులతో అభివృద్ధి చేసిన ‘మహాకాల్ లోక్ కారిడార్’ ఫస్ట్ ఫేజ్​ను ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం జాతికి అంకితం చేశారు. కారిడార్ ప్రారంభానికి సంకేతంగా ‘నంది ద్వారం’ కింద పవిత్ర దారాలతో చుట్టి ఉంచిన భారీ శివలింగాన్ని మోడీ రిమోట్ కంట్రోల్ బటన్ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం బ్యాటరీతో నడిచే ఓపెన్ కార్​లో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూ భాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి మోడీ కొద్ది సేపు కారిడార్​లో విహరించారు. కాలినడకన కూడా తిరుగుతూ స్తంభాలు, శిల్పాలు, ఇతర కళాకృతులను పరిశీలించారు. ఆ తర్వాత జరిగిన పబ్లిక్ ఫంక్షన్​లో ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రస్తుత ‘ఆజాదీ కా అమృత్ కాల్’లో వలసవాద సంకెళ్లను తెంచుకున్నాం. దేశమంతటా నేడు సాంస్కృతిక ప్రదేశాల అభివృద్ధి ఊపందుకున్నది. మొదటిసారిగా చార్ ధామ్​లను ఆల్ వెదర్ రోడ్లతో కనెక్ట్ చేసుకున్నాం. అయోధ్యలో రాముడి గుడి నిర్మాణ పనులు ఫుల్ స్పీడ్​తో సాగుతున్నాయి. కాశీలో విశ్వనాథ్ ధామ్ దేశ కల్చర్ కే గర్వకారణంగా నిలుస్తుంది. దేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల కీర్తిని మళ్లీ చాటుతున్నాం” అని ప్రధాని మోడీ అన్నారు. 

గర్భగుడిలో మోడీ పూజలు  
దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర ఆలయం చుట్టూ అభివృద్ధి పనుల కోసం మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా గుడి చుట్టూ పలు అభివృద్ధి పనులతో పాటు గుడి వద్ద ఉన్న రుద్రసాగర్ లేక్​ను పునరుద్ధరించి, ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దారు. కారిడార్ ప్రారంభానికి ముందు మోడీ సంప్రదాయబద్ధంగా తెల్లని ధోతీ కట్టుకుని, భుజంపై శాలువాతో మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలో 20 నిమిషాల పాటు పూజలు నిర్వహించారు. తర్వాత పది నిమిషాల పాటు మెడిటేషన్ చేశారు. ఆలయంలోని నంది వద్ద కూడా ఆయన పూజలు చేశారు. హుండీలో కానుకలు సమర్పించారు. కార్యక్రమంలో సాధువులు, ఆలయ పూజారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.    

కారిడార్​ విశేషాలు

  • ‘మహాకాళేశ్వర్​ టెంపుల్​ కారిడార్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్టు’ కోసం మొత్తం రూ.856 కోట్లు కేటాయించారు. అందులో ‘మహాకాల్​లోక్​ కారిడార్’ 900 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని కోసం రూ.316 కోట్లు ఖర్చు చేశారు. 
  • రుద్రసాగర్​ చెరువు చుట్టూ అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు.
  • కారిడార్​ ఎంట్రెన్స్​లో నందిద్వార్, 
  • పినాకి ద్వార్​లు ఉంటాయి. 
  • ‘శివలీల’ పేరుతో 108 పిల్లర్లు కనిపిస్తాయి. స్థల పురాణాన్ని వివరించే 93 విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని రాజస్థాన్, గుజరాత్​, ఒడిశాకు చెందిన 400 మంది కళాకారులు అందంగా చెక్కారు.
  • ఏడు పీఠాలపై ఉన్న సప్తరుషుల శిల్పాలు ఎంతో ఆకర్షిస్తుంటాయి.
  • రుద్రసాగర్​ చెరువు ముందు 111 అడుగుల భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
  • ఇప్పుడు 7 ఎకరాల్లో ఉన్న ఆలయం.. ప్రాజెక్టు పూర్తయ్యాక 116 ఎకరాలకు విస్తరిస్తుంది.