సర్ కు ప్రింటింగ్ సమస్య.. ఓటర్లకు ఇవ్వాల్సిన నోటీసులు ఇంకా ప్రింట్ కాలే..

 సర్ కు ప్రింటింగ్ సమస్య.. ఓటర్లకు ఇవ్వాల్సిన నోటీసులు ఇంకా ప్రింట్ కాలే..
  •  హైదరాబాద్ జిల్లాలో 12 లక్షల మంది  
  • సెప్టెంబర్​16 వరకే గడువు..ఉన్నది 15 మంది ఈఆర్‌‌‌‌వోలే..
  • రోజుకు 40 వేల మంది అభ్యంతరాలు వినుడు సాధ్యమేనా?

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ జిల్లాలో ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌(సర్) ప్రక్రియకు ప్రింటింగ్​సమస్య అడ్డంకిగా మారింది. ఇప్పటికే 2002 డిటెయిల్స్​రాయనివి, పేర్లు, ఇతర వివరాలు తప్పుగా రాసిన వారికి నోటీసులు జారీ చేయాల్సి ఉండగా, ప్రింటింగ్‌‌‌‌ పూర్తికాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల రిలీజ్​చేసిన డ్రాఫ్ట్​ప్రకారం హైదరాబాద్​జిల్లాలో 27,95,225  మంది ఓటర్లున్నట్టు తేలగా.. ఇందులో 5.80 లక్షల మంది ఓటర్ల  పూర్తి వివరాలు లేకపోవడంతో మ్యాపింగ్‌‌‌‌ కాలేదు. 

మరో 6,72,678 మంది ఓట్లు మ్యాపింగ్‌‌‌‌ అయినా వారి పేర్లు, ఇతర వివరాలు(అనామలీస్‌‌‌‌) తప్పుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండూ కలిపి 12,53,586 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. అలాగే, నోటీసులు ఇచ్చిన తర్వాత అభ్యంతరాలను వినేందుకు సెప్టెంబర్​16 వరకే గడువు ఉంది. హియరింగ్​కు కూడా కేవలం 15 మంది ఈఆర్‌‌‌‌వోలు మాత్రమే ఉన్నారు. 

వీరు నెల రోజుల్లో 12 లక్షల మంది ఓటర్లు.. అంటే రోజుకు 40 వేల మంది అభ్యంతరాలను వినాలి. ఇంకా నోటీసుల ప్రింటింగే  పూర్తి కాకపోవడంతో ఎప్పుడు ప్రింట్​చేస్తారు? ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఎప్పుడు హియరింగ్​పూర్తవుతుంది? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

అనామలీస్‌‌‌‌ ఓటర్లంటే..

ఎన్యూమరేషన్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో పేరు, ఇంటిపేరు, తల్లిదండ్రుల పేర్లు తదితర వివరాల్లో తప్పులుండడం, ప్రస్తుత ఓటరు వివరాలు 2002 జాబితాతో సరిపోలకపోవడం వంటి అంశాలను అనామలీస్‌‌‌‌గా గుర్తిస్తున్నారు. కుటుంబ సంబంధాల వివరాల్లో తేడాలు కూడా అనామలీస్‌‌‌‌ కిందకే వస్తాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏండ్ల లోపు ఉండడం, ఒకే తల్లిదండ్రులకు చెందిన పిల్లల మధ్య వయస్సు తేడా తొమ్మిది నెలల కంటే తక్కువగా ఉండడం, బంధుత్వం తప్పుగా నమోదవడంతో పాటు ఇతర అంశాలను అనామలీస్‌‌‌‌గా పరిగణించి నోటీసులు ఇవ్వనున్నారు. 

పేరు, తండ్రి లేదా భర్త పేరు, అడ్రస్​తదితర ప్రాథమిక వివరాల్లో తప్పులున్నా నోటీసులు ఇచ్చే చాన్స్​ఉంది. అనామలీస్‌‌‌‌ లో ఉన్నంత మాత్రాన ఓటు బోగస్‌‌‌‌ అని, తొలగిస్తారని భావించాల్సిన అవసరం లేదని, మరోసారి పరిశీలించి, వివరాలు సరైనవేనా కావా అని నిర్ధారించుకునేందుకే నోటీసుల ప్రక్రియ అని అధికారులు చెప్తున్నారు.


నోటీసులు వస్తే ఇలా చేయండి..

నోటీసు అందుకున్న ఓటర్లు తమ వివరాలు సరైనవేనని నిరూపించేందుకు ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాల్లో అవసరమైన వాటిని సమర్పించాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ ఆధారంగా సమర్పించాల్సిన పత్రాల్లో మార్పులు ఉన్నాయి. 

1987 జులై 1కి ముందు పుట్టిన వారు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. 1987 జులై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య పుట్టిన వారు ఒక గుర్తింపు పత్రంతో పాటు తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఒకరి గుర్తింపు పత్రం సమర్పించాలి. 

2004 డిసెంబర్ 2 తర్వాత పుట్టిన వారు తమ గుర్తింపు పత్రంతో పాటు తల్లిదండ్రులిద్దరి గుర్తింపు పత్రాలు సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఐడీ కార్డు, రిటైర్డ్​ ఉద్యోగులు పెన్షన్‌‌‌‌ చెల్లింపు ఉత్తర్వులు(పీపీఓ), ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రాలు, పాస్‌‌‌‌పోర్టు, ఎస్సెస్సీ మెమో లేదా ఇతర విద్యార్హత పత్రాలు, బర్త్​, రెసిడెన్సీ, క్యాస్ట్​ సర్టిఫికెట్​, అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం, జాతీయ పౌర పట్టిక(ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీ), ఫ్యామిలీ రిజిస్టర్‌‌‌‌ సర్టిఫికెట్​, భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రం, ఆధార్‌‌‌‌ కార్డు... వీటిలో ఏదైనా ఈఆర్వోకు సమర్పించవచ్చు.