షమీ 2.0 : రెడీ ఫర్ యాక్షన్

షమీ 2.0 : రెడీ ఫర్ యాక్షన్

లెక్కలేనన్ని ఉలి దెబ్బలు తిన్నాక శిల  శిల్పంగా మారిన రీతిలో జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న  టీమిండియా పేసర్‌‌ మహ్మద్‌‌ షమీ ఊహకందని రీతిలో ఎదిగాడు. ఎదురైన ప్రతి సమస్యను, అవమానాన్ని అవకాశంగా మార్చుకుని తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఒకప్పుడు యో యో (ఫిట్‌‌నెస్‌‌ పరీక్ష) టెస్ట్‌‌ పాసవలేక జట్టుకు దూరమైన షమీ ప్రస్తుతం ప్రధాన పేసర్‌‌ స్థాయికి చేరాడు. ఈ ఏడాది జనవరి ముందు దాకా జట్టులో చోటుపై గ్యారంటీ లేని షమీ ఏకంగా వరల్డ్‌‌కప్‌‌కు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌‌లో పరిస్థితులు, జట్టు కూర్పు తదితర అంశాల దృష్ట్యా ఇన్నాళ్లు బెంచ్‌‌కు పరిమితమైన షమీ.. అనుకోకుండా భువనేశ్వర్‌‌ గాయపడడంతో శనివారం అఫ్గానిస్థాన్‌‌తో జరిగే మ్యాచ్‌‌లో బరిలోకి దిగనున్నాడు. కెరీర్‌‌లో షమీకి ఇది రెండో వరల్డ్‌‌కప్‌‌. అయితే 2015 ఎడిషన్‌‌లో ఆడిన షమీకి ఇప్పుడున్న షమీకి పోలికే లేదు. గాయాలు, క్రికెటేతర సమస్యలతో కెరీర్‌‌ను ప్రశ్నార్థకం చేసుకున్న షమీ గత నాలుగేళ్లలో  చాలా మారాడు. ఎంతలా అంటే వెర్షన్‌‌ 2.0 అనే రేంజ్‌‌లో ఛేంజ్‌‌ అయ్యాడు. గత వరల్డ్‌‌కప్‌‌ ముగిసినప్పటి నుంచి 2019 జనవరి వరకు మూడన్నరేళ్ల కాలంలో షమీ కేవలం ఐదు వన్డేలే ఆడాడు.

ఈ మధ్య కాలంలో కుటుంబపరంగా, కెరీర్‌‌ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఫిట్‌‌నెస్‌‌ టెస్ట్‌‌ పాసవక గతేడాది జూన్‌‌లో స్వదేశంలో అఫ్గానిస్థాన్‌‌తో జరిగిన ఏకైక టెస్ట్‌‌కు ఎంపికవ్వలేకపోయాడు. అయినా..  నిరుత్సాహపడని షమీ తనని తాను మార్చుకున్నాడు. బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌‌కు ఎంపికయ్యాడు. ఈ చాన్స్‌‌ను రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.  అడిలైడ్‌‌లో జరిగిన వన్డేలో మూడు, మెల్‌‌బోర్న్‌‌ మ్యాచ్‌‌లో రెండు వికెట్లు తీసి సత్తాచాటిన సీనియర్‌‌ పేసర్‌‌  న్యూజిలాండ్‌‌ టూర్‌‌కు కూడా సెలెక్ట్‌‌ అయ్యాడు. అక్కడ కూడా రాణించాడు.  నేపియర్‌‌ వన్డేలో మాడు కీలక వికెట్లు తీసి మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు. దీంతో ఐపీఎల్‌‌ ప్రారంభానికి ముందు వరల్డ్‌‌కప్‌‌ సన్నాహంగా స్వదేశంలో జరిగిన ఆసీస్‌‌ సిరీస్‌‌కు ఎంపికయ్యాడు. అదే స్పీడ్‌‌లో వరల్డ్‌‌కప్‌‌ జట్టులో స్థానం కొట్టేశాడు. అయితే మెగా టోర్నీ కోసం ఇంగ్లండ్‌‌ వచ్చినా ఇన్ని రోజులూ ఎక్స్‌‌ట్రా ప్లేయర్‌‌గా బెంచ్​పైనే ఉండిపోయాడు. ఇప్పుడు అఫ్గాన్‌‌తో జరిగే మ్యాచ్‌‌లో బరిలోకి దిగనున్నాడు. ఒకప్పుడు అఫ్గాన్‌‌తో మ్యాచ్‌‌కు ముందు ఫిట్‌‌నెస్‌‌ టెస్ట్‌‌ ఫెయిలై జట్టుకు దూరమైన షమీ.. ఇప్పుడు అదే టీమ్​పై సత్తా చాటి వరల్డ్‌‌కప్‌‌లో అదిరిపోయే ఎంట్రీ ఇవ్వాలని  ఆశిస్తున్నాడు.