రష్యాలో ప్రైవేట్ సైన్యం తిరుగుబాటు.. అసలు ఏం జరుగుతుంది ?

రష్యాలో ప్రైవేట్ సైన్యం తిరుగుబాటు.. అసలు ఏం జరుగుతుంది ?

మొన్నటి వరకూ ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటించి వార్తల్లో నిలిచిన రష్యా.. ఇప్పుడు తన దేశంలోనే అంతర్గత తిరుగుబాటు ఎదురుకావడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. దేశానికి అండగా ఉంటూ వచ్చిన వాగ్నర్ గ్రూప్ సైన్యం.. ఇప్పుడు అధ్యక్షుడు పుతిన్ ప్రభుత్వానికే ఎదురు తిరిగింది. సైన్యానికి అండగా ఉంటూ సహాయ సహకారాలందించిన ప్రైవేట్ పారా మిలటరీ గ్రూప్ వాగ్నర్.. అధికారపార్టీపై సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చాయి. అంతే కాదు రెండు రష్యా నగరాలను కైవసం చేసుకున్నట్టు ప్రకటించడం రష్యాతోపాటు ప్రపంచం షాక్ అయ్యింది. ఓ వైపు ఉక్రెయిన్ తో పోరులో ఉన్న రష్యాకు.. దేశంలోని సైన్యం తిరుగుబాటు తలకు మించిన భారంగా మారింది.

రష్యా సైన్యానికి, ప్రైవేటు మిలటరీ సైన్యానికి తలెత్తిన ఈ వివాదంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. తమ క్యాంపుపై దాడి చేసి పెద్ద సంఖ్యలో.. తమ సైనికుల్ని హతమార్చారని వాగ్నర్ గ్రూప్ అధినేత యవ్జెనీ ప్రిగోజిన్ చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రష్యన్ నగరాలు రొస్తావ్, వొరోనెజ్ లోని కీలక సైనిక సౌకర్యాలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ పరిణామాల క్రమంలో వాగ్నెర్ సైనికులను అదుపులోకి తీసుకోమని అధ్యక్షుడు పుతిన్.. సైన్యాన్ని ఆదేశించారు. అంతే కాకుండా వారు దాడికి సంబంధించిన వార్తలు కూడా అవాస్తవమని ఆరోపిస్తూ.. అక్కడి మీడియాలో వారి ప్రసారాలను కూడా నిలిపివేసింది.

ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న వాగ్నర్ గ్రూప్.. ఎంతకైనా తెగిస్తామని.. రష్యాను హస్తగతం చేసుకుంటామని ప్రకటనలు చేస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, రష్యా సైన్యం దురాగతాలను అంతం చేస్తామంటూ.. రష్యా సైనిక స్థావరాలు, నగరాల దిశగా దూసుకెళుతుంది వాగ్నర్ ప్రైవేట్ సైన్యం. వీరిని కట్టడి చేయటానికి.. అదుపులోకి తీసుకురావటానికి రష్యా సైన్యం ఎదురుదాడి చేస్తుంది. ప్రస్తుతానికి రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్లు పోరాటం చేస్తున్నాయి.

మరో వైపు రష్యా దేశంలోని అంతర్గత తిరుగుబాటుపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. ఇప్పుడు సొంత సైన్యంతో యుద్ధం చేయటం వల్ల వచ్చే పరిణామాలు ఏంటీ అనేది ఆసక్తిగా మారింది.