ముంబై: దేశీయ బ్యాంకింగ్ రంగంలోని నాలుగు పెద్ద ప్రైవేట్ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) మొదటి క్వార్టర్ (క్యూ1) ఫలితాలను శనివారం వెల్లడించాయి. ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకుల నికర లాభం రెండంకెల వృద్ధిని నమోదు చేయగా, దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ మాత్రం స్వల్ప వృద్ధితో స్థిరమైన ఫలితాలను ప్రకటించింది.
బ్యాంక్ పేరు నికర లాభం వృద్ధి (ఏడాదిలెక్కన) నికర వడ్డీ ఆదాయం వృద్ధి
హెచ్‌డీఎఫ్‌సీ రూ. 19,060 కోట్లు 5శాతం రూ. 33,534 కోట్లు 7%
ఐసీఐసీఐ రూ. 14,805 కోట్లు 15.9శాతం రూ. 24,384 కోట్లు 12.7%
కోటక్ రూ. 4,123 కోట్లు 25.6శాతం రూ. 7,928 కోట్లు 9.2%
యాక్సిస్ రూ. 7,113 కోట్లు 22.5శాతం రూ. 14,646 కోట్లు 8%
1) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల విలువ ఏప్రిల్–జూన్ (క్యూ1) లో 3శాతం తగ్గి రూ. 35,846 కోట్లకు చేరాయి. గ్రాస్ ఎన్‌పీఏల రేషియో 1.17శాతం కాగా, నెట్ ఎన్‌పీఏ 0.41శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ప్రొవిజన్లు 79శాతం తగ్గి రూ. 3,060 కోట్లకు చేరాయి.
2) ఐసీఐసీఐ బ్యాంక్ ఇచ్చిన రుణాలు 19.6శాతం వృద్ధి చెంది రూ. 16.31 లక్షల కోట్లకు, డిపాజిట్లు 14శాతం వృద్ధితో రూ. 18.34 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా రూరల్ లోన్లు 35.4శాతం వృద్ధి చెందాయి. గ్రాస్ ఎన్‌పీఏల రేషియో1.38శాతానికి, నెట్ ఎన్‌పీఏల రేషియో 0.35శాతానికి మెరుగయ్యాయి.
3) కోటక్ బ్యాంక్ ఇచ్చిన లోన్లు 15శాతం పెరిగి రూ. 5.12 లక్షల కోట్లకు, డిపాజిట్లు 12శాతం పెరిగి రూ. 5.72 లక్షల కోట్లకు చేరాయి. గ్రాస్ ఎన్‌పీఏల రేషియో 1.18శాతం వద్ద స్థిరంగా ఉంది. నెట్ ఎన్‌పీఏల రేషియో మాత్రం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 0.25 శాతం ఉంటే 0.27 శాతానికి స్వల్పంగా పెరిగింది.
4) యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ జారీలు మార్చి క్వార్టర్ (11 లక్షల) తో పోలిస్తే క్యూ1లో 9.2 లక్షలకు తగ్గాయి. గ్రాస్ ఎన్‌పీఏ రేషియో 1.23 శాతం నుంచి 1.28శాతానికి స్వల్పంగా పెరిగాయి.
