నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్ చేస్తం : ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం

నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్ చేస్తం : ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం
  • ఒకటో తేదీలోపు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.900 కోట్లు ఇవ్వాల్సిందే 
  • ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల ఒకటో తేదీ లోపు ప్రైవేటు కాలేజీలకు రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (ఫతీ) డిమాండ్ చేసింది. లేకపోతే నవంబర్ 3 నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలతో పాటు ప్రొఫెషనల్ కాలేజీలన్నీ నిరవధికంగా మూసివేస్తామని ప్రకటించింది.

ఆదివారం హైదరాబాద్​లోని గచ్చిబౌలిలో ఫతీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఫతీ చైర్మన్ రమేష్ బాబు, సెక్రటరీ జనరల్​ కేఎస్​ రవికుమార్, ట్రెజరర్​ కృష్ణారావు మాట్లాడారు. దసరా, దీపావళికి ముందే విడుదల చేస్తామని హామీ ఇచ్చిన రూ.1,200 కోట్లలో ఇప్పటి వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన 900 కోట్లు నవంబర్ 1 వరకు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

2024–25 అకడమిక్ ఇయర్ వరకు పెండింగ్ లో ఉన్న రూ.9వేల కోట్ల బకాయిలను వచ్చేఏడాది మార్చి 31లోగా  చెల్లించేందుకు రోడ్ మాప్​ ప్రకటించి అమలు చేయాలని కోరారు. హామీ ఇచ్చి నెరవేర్చకపోతే మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే ఫైనల్ పరీక్షలను కూడా బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నవంబర్ ఒకటో తేదీలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.

బెదిరింపులకు భయపడి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. బకాయిలు అడిగితే విజిలెన్స్ తనిఖీలు గుర్తు చేస్తున్నారన్నారు. సర్కారు న్పందించకపోతే మూడో తేదీ నుంచి ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మూడు లక్షల మందితో ఓఆర్​ఆర్​ శివారులో భారీ బహిరంగ సభ పెడ్తామని, అప్పటికీ న్యాయం జరగకపోతే హైదరాబాద్​కు పది లక్షల మంది విద్యార్థులతో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఫతీ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, రాందాస్, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.