
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని, లేకపోతే వచ్చే నెల 3 నుంచి కాలేజీల బంద్ చేపడ్తామని ప్రైవేటు మేనేజ్‌మెంట్ల కాలేజీలు తెలిపాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ (ఫతీ) చైర్మన్ ఎన్.రమేశ్ బాబు, సెక్రటరీ జనరల్ రవికుమార్, ట్రెజరర్ కృష్ణారావు తదితర ముఖ్య నేతలు సమావేశమయ్యారు.
అనంతరం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును కలిసి వినతిపత్రం అందించారు. ఇప్పటికీ రీయింబర్స్ రాని కాలేజీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని, అలాగే, మైనార్టీ కాలేజీల బకాయిలూ విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు రూ.900 కోట్లను నవంబర్ 1వ తేదీలోపు రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్‌లో ఉన్న మొత్తం రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ 2026 ఏప్రిల్ 1వ తేదీలోపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 3 నుంచి చేపట్టబోయే బంద్‌కు సంబంధించి ఈ నెల 22న సర్కారుకు నోటీసులివ్వనున్నట్టు తెలిపారు. 25న స్టూడెంట్ యూనియన్లతో, నవంబర్ 1న పార్టీలతో సమావేశం కానున్నట్టు వెల్లడించారు.