హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతగా ఈ నెల 8న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఫతీ) తలపెట్టిన స్వాంతన సభను బండ్లగూడలోని అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించనున్నట్లు సమాఖ్య నేతలు తెలిపారు. మొదట ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని భావించినా, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వేదిక మార్చారు. సికింద్రాబాద్, ఉప్పల్, సరూర్‌నగర్ స్టేడియంలో ఏదైనా కేటాయించాలని ఫతీ ప్రతినిధులు కోరారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో గురువారం సాయంత్రం హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనున్నదని, కోర్టు తీర్పునకు అనుగుణంగా సభ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, బండ్లగూడలో సభ పెట్టాలని నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 11న పది లక్షల మంది విద్యార్థులతో నిర్వహించాలని తలపెట్టిన లాంగ్ మార్చ్ ర్యాలీని 15కు వాయిదా వేస్తున్నట్లు ఫతీ కోర్ కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమాలు ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బంది సంక్షేమం, డిమాండ్లు, విద్యా వ్యవస్థలో మార్పులకు దోహదపడతాయని ఫతీ నేతలు స్పష్టం చేశారు.
