
- అడ్మిషన్లు తీసుకున్నా కాలేజీలు నడవట్లేదు
- విద్యార్థుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు
- ట్యాక్స్ లు ఎగ్గొడుతున్నాయనే ఆరోపణలు
- అటువైపు చూడని ఇంటర్ బోర్డు ఆఫీసర్లు
కరీంనగర్, వెలుగు : ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరిట కరీంనగర్‌లోని కొన్ని ప్రైవేట్ అకాడమీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఓ వైపు కోచింగ్ సెంటర్ పేరిట అడ్మిషన్లు తీసుకుంటూనే.. మరోవైపు ఇంటర్ క్లాసులను సైతం నిర్వహిస్తూ కోట్లలో దందా చేస్తున్నాయి. వీటికి ఇంటర్‌బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకపోయినా, జూనియర్ కాలేజీలు కాకపోయినా, ఇతర ప్రైవేట్ జూనియర్ కాలేజీల పేర్ల మీద విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఆయా కాలేజీల నిర్వాహకులకు కమీషన్లు ఇస్తూ, చివర్లో ఆ కాలేజీల పేర్ల మీదే పరీక్ష రాయిస్తున్నా ఇంటర్ బోర్డు ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.
కాలేజీ ఇక్కడ.. క్లాసులు ఎక్కడ?
కరీంనగర్ సిటీలోని గణేశ్‌నగర్ ఏరియాలో ఓ జూనియర్ కాలేజీ పేరు, కోడ్ నంబర్ బోర్డులు పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తాయి. ఇంటర్ బోర్డు సమాచారం ప్రకారం ఈ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో కలిపి వెయ్యికిపైగా అడ్మిషన్లు జరిగాయి. కానీ కాలేజీకి వెళ్లి చూస్తే అక్కడ బోర్డు, బిల్డింగ్ తప్ప.. స్టూడెంట్స్ లేరు. కానీ అక్కడే ఇంటర్ క్లాసులు జరుగుతున్నట్లు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు రికార్డుల్లో సదరు కాలేజీ యాజమాన్యం చూపుతోంది.
ఈ విద్యార్థులంతా కరీంనగర్ లోని ప్రముఖ ఐఐటీ, నీట్ అకాడమీ నిర్వహిస్తున్న కోచింగ్సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. సదరు సెంటర్‌కు పర్మిషన్ లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీల పేరుతో ఈ దందా నడుపుతున్నట్లు తెలిసింది. కాగా, కాలేజీ అడ్రస్ గా పేర్కొన్న ఇంటి నంబర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడం గమనార్హం.
ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీలు..
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుకుపైగా ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీలు ఉన్నాయి. వీటిలో టెన్త్ పూర్తయిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్ తో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి సిటీలో ఇలాంటి ఏ అకాడమీకి ఇంటర్ బోర్డు నుంచి అనుమతుల్లేవు. ఇవి జూనియర్ కాలేజీలు కాకపోయినా, వీటి నిర్వాహకులు ఇతర ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి ఎన్ రోల్ చేయించుకొని ఆయా కాలేజీల నిర్వాహకులకు కమీషన్లు ఇస్తున్నారు.
చివర్లో ఆ కాలేజీల పేర్ల మీదే పరీక్ష రాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అకాడమీ పేరుతో విద్యార్థులను జాయిన్ చేసుకుని మరో జూనియర్ కాలేజీ నుంచి అడ్మిషన్లు ఫార్వర్డ్ చేయిస్తూ .. కోచింగ్ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు విద్యార్థులకైతే ఏ కాలేజీలో అడ్మిషన్ పొందాం.. ఏ కాలేజీ నుంచి పరీక్ష రాస్తున్నామనేది హాల్ టికెట్ వచ్చేవరకు తెలియకపోవడం గమనార్హం. ఆయా అకాడమీల నిర్వాహకులు.. ఒక్కో విద్యార్థి వద్ద రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తూ ఆదాయ పన్ను సహా వివిధ ట్యాక్స్ లు ఎగ్గొడుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
జూనియర్ కాలేజీ నిర్వహించకుండా, దాని పేరిట అడ్మిషన్లు తీసుకోవడం చట్ట విరుద్ధం. అలాంటి ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇక రెసిడెన్షియల్ కాలేజీల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా కూడా హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్లపై ఇంటర్ బోర్డుకు ఎలాంటి చర్యలు తీసుకునే అధికారంలేదు. వాటి నియంత్రణపై ప్రభుత్వమే దృష్టిపెట్టి పాలసీ తీసుకురావాల్సి ఉంది. - గంగాధర్, ఆర్ఐఓ, కరీంనగర్