- ప్రైవేటు హాస్పిటళ్లపై సర్కార్ సీరియస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సిజేరియన్ డెలివరీలను తగ్గించి, నార్మల్ డెలివరీలను పెంచాలని ఆరోగ్య శాఖ టార్గెట్‌గా పెట్టుకుంది. అనవసరంగా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై సీరియస్‌గా స్పందిస్తోంది. ఇలానే కొనసాగితే పర్మిషన్లు క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో 64% సిజేరియన్లు, 36% నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. దేశంలో ఈ స్థాయిలో సిజేరియన్లు మరే రాష్ట్రంలోనూ లేవు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, సిజేరియన్లు మహిళల ఆరోగ్యాన్నీ దెబ్బతిస్తున్నాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. అందుకే సిజేరియన్లను తగ్గించడానికి ప్రభుత్వ దవాఖాన్లలో చర్యలు మొదలుపెట్టారు. ఒక్కో గైనకాలజిస్ట్ నెలకు ఎన్ని డెలివరీలు చేస్తున్నారు, అందులో సిజేరియన్లు ఎన్ని అనే దానిపై రిపోర్టులు తయారు చేయించి రివ్యూ చేస్తున్నారు. ప్రతి సిజేరియన్‌కు సంబంధిత డాక్టర్ ఆన్సర్ చెప్పాలని రూల్ పెట్టారు. అలాగే మిడ్‌వైఫరీ ప్రోగ్రాం ద్వారా నర్సులకు శిక్షణ ఇచ్చి నార్మల్ డెలివరీలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు.
జిల్లాల్లో చర్యలు షురూ
హరీశ్‌రావు ఆరోగ్య మంత్రిగా వచ్చిన తర్వాత ప్రైవేటు హాస్పిటళ్లలో సిజేరియన్లపై ఫోకస్ పెంచారు. జిల్లా, హాస్పిటళ్ల వారీగా జరుగుతున్న డెలివరీల సంఖ్య, సిజేరియన్ల శాతంపై ఇటీవల రివ్యూ చేశారు. కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల తదితర జిల్లాల్లోని ప్రైవేటు హాస్పిటళ్లలో 90 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్నట్టు గుర్తించారు. ఆయా జిల్లాల్లో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న హాస్పిటళ్ల యాజమన్యాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇకపై అకారణంగా సిజేరియన్లు చేస్తే హాస్పిటల్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. నిర్మల్‌లో కొన్ని హాస్పిటళ్లను సీజ్ కూడా చేశారు.
సర్కార్‌లో ఫర్టిలిటీ సెంటర్లు
రాష్ట్రంలో ఇన్‌ఫర్టిలిటీ సమస్య పెరిగింది. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్‌మెంట్ లేకపోవడంతో ప్రైవేటు హాస్పిటళ్లు దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. జనాలను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. దీంతో అన్ని పెద్ద హాస్పిటళ్లలో ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్ సెంటర్లను పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గాంధీలో ఇప్పటికే ఫర్టిలిటీకి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఐయూఐ, ఐవీఎఫ్ వంటి ప్రొసీజర్లు కూడా చేస్తున్నారు. గాంధీ తరహాలోనే సుల్తాన్‌బజార్, పెట్లబుర్జు, నిమ్స్ తదితర హాస్పిటళ్లలోనూ త్వరలో ఫర్టిలిటీ సెంటర్లను పెట్టి, ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న సుమారు యాభైకి పైగా ఎంసీహెచ్‌లకు విస్తరించాలని యోచిస్తున్నారు.
