కరోనా ట్రీట్‌‌మెంట్ రేట్లు పెంచండి..ప్రైవేట్ ఆస్పత్రుల వినతి

కరోనా ట్రీట్‌‌మెంట్ రేట్లు పెంచండి..ప్రైవేట్ ఆస్పత్రుల వినతి
  •     ఐసీయూకు రోజుకు 40 వేలు చేయాలని ప్రైవేట్ ఆస్పత్రుల వినతి

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా ట్రీట్‌‌మెంట్ రేట్లను సవరించేందుకు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ కసరత్తు చేస్తోంది. పోయినేడు ప్రభుత్వం ఆదేశించిన రేట్లకు ట్రీట్‌‌మెంట్ చేయలేమని హాస్పిటల్‌‌ మేనేజ్‌‌మెంట్లు చెబుతుండడం, హైకోర్టు కూడా వాటిని మార్చాలని ఇటీవల సూచించిన నేపథ్యంలో తెలంగాణ హాస్పిటల్స్‌‌, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్‌‌(తానా), తెలంగాణ సూపర్‌‌‌‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌‌ అసోసియేషన్‌‌(టిషా)తో ఆరోగ్య శాఖ చర్చలు మొదలుపెట్టింది. జనరల్ వార్డులో రోజుకు రూ.పది వేలు, స్పెషల్ రూమ్‌‌కు రూ.15 వేలు, ఐసీయూకు రోజుకు రూ.40 వేలు చొప్పున ఫీజులు ఫిక్స్ చేయాలని కోరుతూ తానా ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. ల్యాబ్‌‌ టెస్టులు, మెడిసిన్‌‌కు మాత్రం వేరేగా చార్జ్‌‌ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మంత్రి హరీశ్‌‌రావును వేర్వేరుగా కలిసి తానా ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. ఈ విషయంలో టిషా నుంచి ఇప్పటివరకూ తమకు ప్రతిపాదనలు రాలేదని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. తానా, టిషా ప్రతినిధులు చర్చించుకుని ఒకే ప్రతిపాదన ఇవ్వాలని ప్రభుత్వం వారికి సూచించింది. శుక్రవారం సాయంత్రానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. కరోనా ట్రీట్‌‌మెంట్ ఫీజులను ఫిక్స్‌‌ చేస్తూ గతేడాది జూన్‌‌ 15న ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీని ప్రకారం జనరల్ వార్డులో ట్రీట్‌‌మెంట్‌‌కు రోజుకు రూ.4 వేలు, ఐసీయూలో రూ.7500, వెంటిలేటర్ పెడితే రూ.9 వేలు చొప్పున చార్జ్ చేయాలి. ఇందులోనే టెస్టులు కూడా చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ నిబంధనలను ఒక్క హాస్పిటల్ కూడా పట్టించుకోవడం లేదు.