మరో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్య

మరో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్య
  • మృతుడు విక్రమ్ గౌడ్ కు భార్య, కుమారుడు
  • ఆర్ధిక ఇబ్బందులు భరించలేకనే ఆత్మహత్య

నల్గొండ: కరోనా దెబ్బకు ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టి మరో ప్రైవేటు ఉపాధ్యాయుడు అర్ధాంతంరంగా ఆత్మహత్య చేసుకున్నాడు.  ఏడాదిగా నడవని స్కూళ్లు.. అందని జీతాలతో ప్రైవేటు ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఇదే కోవలోనే శుక్రవారం నాడు  ప్రైవేట్ ఉపాధ్యాయుడు సాయగొని విక్రం గౌడ్ (28) బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విక్రమ్ గౌడ్ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న ఎన్ వి ఆర్ పాఠశాలలో గత మూడేళ్లుగా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పాఠశాల బంద్ కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కుటుంబం గడవడం కోసం అప్పులు చేయాల్సి రావడం.. తీసుకున్న అప్పులు తీర్చలేక ఇబ్బందులు పెరిగిపోవడంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని స్వస్థలం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఓ గ్రామం.  విక్రం గౌడ్ కు భార్య, పదేళ్ల కుమారుడు కార్తికేయ ఉన్నాడని  నల్గొండ టౌన్ ఎస్ఐ తెలిపారు. భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.