మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు రిపేర్ పనుల కోసం మెదక్‌కు తీసుకువచ్చి, మరమ్మతులు పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలు అంతరాయం కలిగాయి.

