వచ్చే ఏడు పెండ్లి  చేద్దామనుకున్నం: ప్రియాంక పేరెంట్స్

వచ్చే ఏడు పెండ్లి  చేద్దామనుకున్నం: ప్రియాంక పేరెంట్స్

పోలీసులు స్పందిస్తే..మా బిడ్డ బతికేది

హైదరాబాద్, శంషాబాద్, వెలుగు: ‘‘పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇంత దారుణం జరిగింది. కంప్లయింట్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే మా బిడ్డ బతికేది” అని ప్రియాంక రెడ్డి తల్లి విజయ రెడ్డి, తండ్రి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రియాంక కనిపించడం లేదని బుధవారం రాత్రి11 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే డ్యూటీలో ఉన్న పోలీసులు నిర్లక్ష్యం చేశారు. దాదాపు మూడు గంటల తర్వాత ఫిర్యాదు తీసుకున్నారు. ఫిర్యాదు ఇవ్వగానే పోలీసులు స్పందించి ఉంటే మా కూతురు బతికేది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా మా బిడ్డ చనిపోయింది” అని ఆరోపిస్తూ వారు కన్నీరు మున్నీరయ్యారు. ప్రియాంక రెడ్డిని ఉన్నత చదువులు చదివించామని, ఆమె 2017లో డాక్టర్ కోర్సు పూర్తి చేసుకొని అదే సంవత్సరం వెటర్నరీ డాక్టర్ ఉద్యోగం పొందడంతో చాలా సంతోషించామని వారు తెలిపారు. వచ్చే సంవత్సరం ప్రియాంకకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని చెబుతూ రోదించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, వారికి మరణశిక్ష విధించి తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రియాంక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

వాళ్ల కోసం ఎవరూ వాదించొద్దు: శ్రీధర్ రెడ్డి

సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ వివరాలు తెలుసుకున్న ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. తన కూతురుపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురి తరుపున ఏ న్యాయవాదీ కోర్టులో వాదించకూడదని కోరారు. ఓ ఆడపిల్ల తండ్రిగా లాయర్లందరినీ తాను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. సమాజంలో జరిగే నేరాలపై అవగాహన లేకే నా కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఆడపిల్లకు ఇలాంటి ఘటన జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Priyanka reddy's parents says her daughter death because of negligence of the police