పథకం ప్రకారమే ప్రియాంక స్కూటీ పంక్చర్

పథకం ప్రకారమే ప్రియాంక స్కూటీ పంక్చర్

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత కేసు గురించి పోలీసులు మీడియాతో మాట్లాడే అవకాశముంది.

ప్రియాంక హత్యకేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సాయం చేస్తున్నట్లు నటించి ప్రియాంకను చిదిమేశారు నిందితులు. టోల్‌గేట్ దగ్గర ప్రియాంక స్కూటీని పార్క్ చేయడాన్ని ముందే గమనించిన లారీ డ్రైవర్లు.. ఆమె తిరిగి రాక ముందే స్కూటీ టైర్‌ను పంక్చర్ చేసినట్లు తెలుస్తోంది. టైర్ పంక్చర్ వేయిస్తామని నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పినట్లు సమాచారం. ఈ దారుణానికి పాల్పడిన లారీడ్రైవర్లు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత వారంతా కర్నూలు మీదుగా అనంతపురం వైపు వెళ్లారని సమాచారం. ఈ వివరాలతో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు.. లారీ డ్రైవర్‌ మహ్మద్ పాషాతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహ్మద్ పాషా నారాయణపేట జిల్లా మక్తల్ చెందినవాడుగా తెలుస్తోంది.

ప్రియాంక స్కూటీని కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్‌ వద్ద పోలీసులు కనుగొన్నారు. స్కూటికి సంబంధించిన నంబర్‌ ప్లేట్లను దుండగులు తీసేశారు. ప్రియాంక మృతదేహాన్ని కాల్చేయడానికి పెట్రోల్‌ను ఆమె స్కూటిపైనే వెళ్లి తెచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మృతదేహాన్ని కాల్చినచోటుకు సమీపంలోనే స్కూటీ కూడా లభ్యమైంది. ప్రియాంకను టోల్‌గేట్ దగ్గరే చంపి.. అక్కడి నుంచి కొత్తూరు దాకా మృతదేహాన్ని, స్కూటీని.. లారీలో తరలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంకకు సాయం చేస్తున్నట్లు చాలా సేపు నటించి.. ఆ తర్వాత రోడ్డు పక్కన పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. శవాన్ని దుప్పటిలో చుట్టి పెట్రోల్ పోసి కాల్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

ప్రియాంక కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఘోరం జరిగేది కాదని ప్రియాంక తల్లితండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యుల్ని మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరామర్శించారు. దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే డయల్‌ 100, షీ టీమ్స్‌కు సమాచారం ఇవ్వాలని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

కాగా.. ప్రధాన నిందితుడు పాషా తల్లి మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు రాత్రి పాషా హడావుడిగా ఇంటికి వచ్చి వెళ్లినట్లు ఆమె తెలిపారు. ప్రియాంక హత్య కేసును సుమోటో కేసుగా స్వీకరించి జాతీయ స్థాయిలో దర్యాప్తు చేస్తామని మహిళా కమిషన్ తెలిపింది.