వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఏర్పాట్లు.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ఏర్పాట్లు.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలవనుంది. ఇందుకు అవసరమైన వసతుల ఏర్పాట్లపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు తగిన సూచనలు జారీ చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన పరిపాలనా అధికారులతో కో-విన్ సాఫ్ట్‌‌వేర్ వినియోగం పై కేంద్రం వర్చువల్ సమావేశం నిర్వహించింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కో-విన్ సాఫ్ట్‌‌వేర్ కీలకం కానుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌కు సంబంధించి టెక్నాలజీ, డేటా మేనేజ్‌‌మెంట్ గ్రూప్‌‌కు చైర్మన్‌‌గా ఉన్న రామ్ సేవక్ శర్మ కో-విన్ గురించి పలు విషయాలు చెప్పారు. ‘కరోనా వ్యాక్సినేషన్ కోసం అత్యంత సురక్షిత, నమ్మదగిన టెక్నాలజీ అవసరం ఉంది. అందుకే కో-విన్‌‌ అనే సాఫ్ట్‌‌వేర్‌‌ను వాడుతున్నాం. వేగంతోపాటు అధిక సంఖ్యలో ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని నాణ్యతతో ఈ సాఫ్ట్‌‌వేర్‌‌ను రూపొందించారు. ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఇమ్యూనైజేషన్‌‌ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాం’ అని రామ్ సేవక్ వివరించారు.