భర్త మహాశయులకు విజ్ఞప్తి...బయ్యర్లు లాభాల్లోకి రావడం సంతృప్తినిచ్చింది: నిర్మాత సుధాకర్ చెరుకూరి

భర్త మహాశయులకు విజ్ఞప్తి...బయ్యర్లు లాభాల్లోకి రావడం సంతృప్తినిచ్చింది: నిర్మాత సుధాకర్ చెరుకూరి

వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌‌తో దూసుకెళ్తున్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి.  నాని హీరోగా ‘ది ప్యారడైజ్‌‌’, దుల్కర్‌‌‌‌ సల్మాన్‌‌, పూజాహెగ్డే జంటగా ఓ చిత్రంతో పాటు చిరంజీవి హీరోగా ఓ చిత్రం చేయబోతున్నారు. ఇక రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన  నిర్మించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతికి విడుదలై హౌస్‌‌ ఫుల్‌‌ కలెక్షన్స్‌‌తో రన్‌‌ అవుతోంది. ఈ నేపథ్యంలో సుధాకర్ చెరుకూరి ఇలా ముచ్చటించారు.  

‘‘ఆడియెన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రాలో దాదాపుగా బ్రేక్‌‌ ఈవెన్‌‌ అయింది. ఈ వీకెండ్‌‌కు నైజాంతో పాటు మిగతా ఏరియాల్లో కూడా అయిపోతుంది.  సంక్రాంతికి రవితేజ గారు హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌తో రావాలని ముందే ప్లాన్‌‌ చేసుకుని 65 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. మేము అనుకున్నట్టుగానే జనం అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు.  ఈ తరహా ఫ్యామిలీ సినిమాలకు సంక్రాంతి సీజన్‌‌లో డిమాండ్ బాగుంటుందని మరోసారి రుజువైంది. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ చాలా హ్యాపీగా ఉండటం ఓ నిర్మాతగా నాకు సంతృప్తిని ఇచ్చింది.  సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ఆప్షన్.  అందరూ దాన్ని చూసేశారు కనుక సెకండ్ వీక్ నుంచి మిగతా సినిమాల రన్ అద్భుతంగా ఉండబోతుంది. ఇక ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకునే ఓ సినిమా తీయాలనే ఓ డ్రీమ్ ఉంది.  ‘ది ప్యారడైజ్’ చిత్రంతో అది తీరిపోతుందని నమ్మకం ఉంది.  

అరవై శాతం షూటింగ్ పూర్తయింది.  మార్చిలోనే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే రామ్ చరణ్‌‌ గారి ‘పెద్ది’ కూడా ఉంది. రెండు చిత్రాలు ఒకే టైమ్‌‌కు రావు. సంక్రాంతికే డిస్ట్రిబ్యూటర్స్ మీద రుద్దేసి తప్పు చేశాం. మళ్ళీ అలా జరగకూడదు. మేమంతా ఫ్రెండ్స్‌‌. సమ్మర్‌‌‌‌లో పెద్ద సినిమాలేవీ లేవు కనుక సర్దుకుపోతాం. ఇక దుల్కర్ సల్మాన్‌‌, పూజ హెగ్డే కలిసి చేస్తున్న సినిమా అద్భుతంగా వస్తోంది. 35 రోజులు అమెరికాలో షెడ్యూల్ ఉంది. వాళ్ల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ‘కేజేక్యూ’ చిత్రాన్ని త్వరలో విడుదల చేయబోతున్నాం. ‘ప్యారడైజ్’ పూర్తయ్యాక చిరంజీవి గారి సినిమా స్టార్ట్‌‌ చేస్తాం. అది పీరియాడిక్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ. అలాగే కిషోర్ తిరుమల డైరెక్షన్‌‌లో ఓ లవ్‌‌ స్టోరీ చేయబోతున్నాం. నాకు ‘అరుంధతి’ లాంటి సినిమా చేయాలనుంది. అలాంటి ఒక కథపై కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి”.