ప్రేక్షకులు థియేటర్లో చూస్తేనే మూవీకి నిజమైన సక్సెస్

ప్రేక్షకులు థియేటర్లో చూస్తేనే మూవీకి నిజమైన సక్సెస్

ఓటిటి సినీ ఇండస్ట్రీలో పెను మార్పులు తెచ్చింది. నెలవారీ సబ్ స్క్రిప్షన్తో ప్రేక్షకుడు తనకు ఇష్టం వచ్చిన సినిమాను ఇంట్లోనే చూసేస్తున్నాడు. ఇక  కొత్త సినిమా రిలీజైతే చాలు..మినిమం రెంటల్ చార్జీలతో ఫ్యామిలీ మొత్తం దర్జాగా కూర్చోని  మూవీని వీక్షించేయొచ్చు. దీని వల్ల ప్రేక్షకుడికి లాభం కలుగుతుంది. 

మూతపడే దిశగా థియేటర్లు..
ఓటిటి వల్ల ఆడియన్ లాభ పడుతున్నా..థియేటర్ యజమానులు నష్టపోతున్నారు. ఓటిటి వచ్చాక..ప్రేక్షకుడు థియేటర్కు దూరమయ్యాడు. ఓటిటి రాకముందు థియేటర్లలో సినిమా రిలీజైతే చాలు..ఖచ్ఛితంగా ఆడియన్ థియేటర్ లోనే సినిమాను చూసేవాడు. కానీ ఓటిటి పుణ్యమా అని..ప్రేక్షకుడు థియేటర్కు దాదాపు రావడం లేదు. టికెట్ రేట్లు కూడా ఎక్కువుండటంతో థియేటర్ లో చూసేకంటే..ఓటిటికి రెంటల్ చార్జి కడితే అంతా చూసేయోచ్చన్న ఆలోచనలో ఉన్నాడు. జనాలు రాక వందల కొద్ది థియేటర్లు మూత పడే పరిస్థితికి వచ్చాయి. 

ఓటిటి వల్ల  థియేటర్లలో వసూళ్లు కూడా తగ్గిపోయాయి. అటు వందల కోట్లు పెట్టి తీస్తే ..అవి కాస్తా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో చేసేదేమి లేక..నిర్మాతలు వెంటనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అలాగైనా..జరిగిన నష్టాన్ని కొంతైనా పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. అయితే కొందరు పెద్ద నిర్మాతలు తమ లావాదేవీల కోసం ,రొటేషన్ ల కోసం తమ సినిమాలను ముందుగానే ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. ఇదే ఇపుడు సమస్యలు తెచ్చిపెడుతోంది.

నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్ ..
థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాలను కూడా 5 వారాలు గడవకముందే ఓటిటిలో రిలీజ్ చేయడంపై హీరోల ఫ్యాన్స్ నిర్మాతలపై గరం అవుతున్నారు. తమ హీరో సినిమాను మూడు వారాలకే ఓటీటీకి ఇస్తారా అంటూ ప్రొడక్షన్ హౌస్పై ఫైర్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. రీసెంట్గా సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్నా.. 199 రూపాయల రెంటల్ చార్జితో అమెజాన్లో విడుదలైంది. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో సోషల్ మీడియాలో నిర్మాతలపై విరుచుకుపడ్డారు. అయితే సర్కారు వారి పాట మూవీ ఓటిటిలో విడుదల చేస్తున్నట్లు ముందుగానే మహేష్ బాబు తెలుసని  ప్రొడక్షన్ హౌస్ సభ్యులు చెబుతున్నారు.  ఈ గొడవ గురించి తెలుసుకున్న పలువురు నిర్మాతలు.. తమ సినిమాలు మాత్రం 5 నుండి 8 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తాయంటు ప్రకటించేశారు. రీసెంట్ గా వచ్చిన ఎఫ్ 3,మేజర్, పక్కా కమర్షియల్ ఈ మేరకు ప్రకటన చేశారు. అంతే కాదు ఓటిటిల్లోనూ తమ సినిమాలకు తక్కువ టికెట్ రేట్లే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అటు మేజర్కు కూడా తక్కువ రేట్సే ఉంటాయని నిర్మాతలు తెలిపారు. 

మొదట్లో డబ్బులెక్కువస్తాయని ఆశపడిన నిర్మాతలు ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నారు. ప్రేక్షకులు థియేటర్కు వచ్చి చూస్తేనే సినిమాకు నిజమైన సక్సెస్ అని నమ్ముతున్నారు. అందుకే టికెట్ రేట్లు తగ్గించాలని,ఓటీటీలో లేట్ గా వేయాలని చెబుతున్నారు. ఈ సమస్య పై బడా నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఓటీటీలో విడుదల విషయంలో కాస్త సంయమనం పాటించాలని సూచించారు. సినిమా థియేటర్లలో విడుదలయ్యాక.. 8 వారాల నుండి 60 రోజుల వరకు మూవీలను ఓటీటీ లో విడుదల చేయవద్దన్నారు. అలాగే ఓటీటీలో రిలీజ్ చేసే  విషయం లో ముందుగా ఒప్పందం చేసుకోకుండా విడుదల అయిన తర్వాతే ఒప్పందం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా భారీ ఎత్తున పెంచిన టికెట్ల రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారాయన. అప్పుడే ప్రేక్షకుడు సినిమాను థియేటర్లోనే చూస్తాడని..ఆ దిశగా మేకర్స్ కృషి చేయాలని సూచించారు. నిర్మాతల్లో వచ్చిన మార్పుతో మళ్లీ థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతాయంటున్నారు థియేటర్ల యజమానులు. దీనికితోడు సినిమా టికెట్లు తగ్గిస్తే ఖచ్చితంగా మూవీని థియేటర్లోనే చూసేందుకు ఇష్టపడతారని చెబుతున్నారు.