దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో గత నెలా పదిహేను రోజులుగా నడుస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి ప్రొటెస్ట్.. దేశ స్వాతంత్ర్యం తరువాత మొదటి పెద్ద విద్యార్థి ఉద్యమం. అంతేకాకుండా ఇది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థులు తమంతట తాము విద్యా వ్యవస్థ పతనాన్ని ఆపడానికి, అందులో మార్పులు తేవడానికి మొదలెట్టిన పోరాటం.
దీని ఆరంభకుడు ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన దళిత యువకుడు. అభిజిత్ దీప్కే దేశచరిత్రలోనే మొదటి సోషల్ మీడియా ద్వారా ఒక విద్యార్థి పార్టీని స్టార్ట్ చేసి పాలకపక్షాలైన బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌లను వాటి భాషను మాత్రమే మాట్లాడుతున్న మేధావి వర్గాన్ని కుదిపేశాడు. అతను అంతటితో ఆగక అమెరికా నుంచి ఇండియా వచ్చి నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి జంతర్ మంతర్ చేరుకున్నాడు.
అంబేద్కర్ తనకు ఆదర్శమని ఆయన ఫొటో పట్టుకునే విమానం దిగాడు. దేశంలో పలుచోట్ల విద్యార్థి ధర్నాలను అడ్రస్ చేశాడు. హిందూత్వవాదులతో దెబ్బలు తిన్నాడు. చివరికి తనదంటూ ఒక చైతన్యమైన టీమ్ ఏర్పరుచుకుని దేశ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు ప్రొటెస్ట్ ను మొదలెట్టాడు. కుల, మత భేదం లేకుండా యువకులు ఆయన పిలుపునందుకుని జంతర్ మంతర్ తమ అడ్రస్‌గా మార్చుకున్నారు. వారికి ఆహారం, నీళ్లు ప్రజలే ఇవ్వడం మొదలెట్టారు.
ఈ విద్యార్థి ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ అండగా మొదటి నుంచీ ఉన్నాడు. తరువాత అతను నిరంతర ఉపవాసం మొదలెట్టాడు. ఈ క్రమంలో జులై 20న పార్లమెంట్ ప్రారంభం కావడంతో పార్లమెంట్ భవనానికి మార్చ్ పిలుపునిచ్చింది సీజేపీ. ఆ రోజు లక్షలాది మంది యువకులు, యువతులు రోడ్లమీదికి వచ్చారు. బీజేపీ ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో విద్యార్థులపై దమనకాండ జరిపింది.
చిన్నా, పెద్ద చూడకుండా విపరీతంగా కొట్టి విద్యార్థుల తలలు పగలగొట్టారు. కాళ్లు, చేతులు విరగగొట్టారు. టియర్ గ్యాస్‌తో ఊపిరాడకుండా పడిపోయేటట్టు చేశారు. దేశం మొత్తం మీద ప్రభుత్వ దమనకాండ మీద వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్ష పార్టీలన్నీ విద్యార్థులకు మద్దతుగా పార్లమెంటులో, బయట ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మోదీ ఇంటిముందు ధర్నా చేసింది. రాహుల్ గాంధీని కూడా పోలీసులు కిందపడేసి ఈడ్చుకుపోయారు. పోలీసుల దౌర్జన్యం వల్ల ఆయన ముక్కు నుంచి రక్తం వచ్చింది. ఇంత జరిగినా ప్రభుత్వం దిగిరాలేదు. ఇది ఎటు దారి తీస్తుందనే ఉత్కంఠ దేశమంతటా ఉంది.
కాక్రోచ్ జనతా విద్యార్థి ఉద్యమం అలా ప్రభావం చూపుతుందా?
ఈ సంస్థను విద్యార్థులు వెంటనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంది. ఇది రాజకీయ అధికారం కోసమే కాకుండా, రిజిస్ట్రేషన్ లేని ఆర్ఎస్‌ఎస్ పాలసీలను దేశ విద్యావ్యవస్థను మనువాదమయం చేసి కేవలం పూజారీ, వ్యాపార కులాలను అధిక ధనవంతులు చేసే మాయావిద్యని ఆపడం దీని ప్రధాన ఉద్దేశం కావాలి. ఆర్ఎస్‌ఎస్‌కు రిజిస్ట్రేషన్ లేదు. బ్యాంక్ అకౌంట్ లేదు. కానీ వందల కోట్లు విలువచేసే బంగ్లాలు ఉన్నాయి.
దేశ చట్టాలను అనుసరించి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నడుస్తున్న ఈ సంస్థను దానితో ప్రయోజనాలు ఉండేవారు మాత్రమే సపోర్టు చేస్తారు. కానీ దేశం సర్వనాశనమౌతుంది. సీజేపీ కూడా అటువంటి పద్ధతి అనుసరించకూడదు. అది పూర్తిగా చట్టబద్ధ సంస్థగా విద్యా వ్యవస్థను కాపాడే బాధ్యత తీసుకోవాలి. గుర్తింపు వచ్చిన యువకులను రాజకీయ పార్టీలు తమ నిర్మాణంలోకి లాక్కొని ఎన్నికల్లో దింపడం మనకు తెలుసు. కానీ ఈ దేశం ఒక బలమైన, చైతన్యవంతమైన యువకుల సంస్థ రాజ్యాంగాన్ని, విద్యా వ్యవస్థను కాపాడటం చాలా ముఖ్యం. అందుకే ఈ సంస్థ ఇండిపెండెంట్‌గా బతకటం చాలా ముఖ్యం.
1968 ప్యారిస్ విద్యార్థి ఉద్యమంలా..
1968లో ప్యారిస్ నగరంలో ఆనాటి రైట్‌వింగ్ నియంత వంటి జనరల్ డిగాలే ప్రభుత్వం మీద చాలా పెద్ద తిరుగుబాటు ఇలానే చేశారు. ఆ తిరుగుబాటుకు భయపడి డిగాలే ప్యారిస్ వదిలిపెట్టి పారిపోయాడు. మొత్తం ఫ్రెంచి ప్రజలు విద్యార్థి ఉద్యమానికి మద్దతిచ్చారు. ఆ ఉద్యమం మొత్తం యూరప్ విద్యావ్యవస్థలో మార్పు రావడానికి దారితీసింది. డిగాలే ప్రభుత్వం కూడా మోదీ ప్రభుత్వంవలెనే విద్యావ్యవస్థను నాశనం చేసింది.
ఫ్రెంచి విప్లవ ఫలితాలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం అనే ఫ్రెంచి విప్లవ ప్రజాస్వామిక మూల సిద్ధాంతాన్ని పక్కకుపెట్టి రైట్‌వింగ్ నియంతృత్వాన్ని విద్యా వ్యవస్థ మీద రుద్దింది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో డిగాలె గెలిచినప్పటికీ చాలా వ్యవస్థాగత మార్పులొచ్చాయి. యూరప్ పెనుమార్పులకు ఆ విద్యార్థి తిరుగుబాటుకు దారితీసింది.
పేపర్ లీకేజీ విద్యావ్యవస్థను వెనక్కి నెట్టడంలో భాగం
బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ అధికారంలోకి వచ్చాక మొత్తం విద్యావ్యవస్థను పురాతనీకరించడానికి పూనుకున్నాయి. అందులో ప్రభుత్వ విద్యావ్యవస్థల్లో ఇంగ్లిష్ భాషను చంపి పూర్తిగా ప్రాంతీయ భాషల్లోకి విద్యా వ్యవస్థలను మలచడం ఒకటి. అదే సందర్భంలో పెద్ద ఎత్తున విద్యను ప్రైవేటీకరించడం రెండోది.
ఆర్ఎస్‌ఎస్, బీజేపీకి అండగా ఉండే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు చాలా డబ్బుతో మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోగలిగే ప్రైవేటు స్కూళ్లను, కాలేజీలను, యూనివర్సిటీలను నడిపి కింది కులాలకి, బీదవారికి ఇంగ్లిష్ చదువు రాకుండా చూడటం అందులో కీలకమైనది. అభిజిత్ దీప్కే విషయమే తీసుకోండి. అతను కేవలం మరాఠీ మీడియంలోనే చదివి ఉంటే ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే సోషల్ మీడియం యుద్ధం చేయగలిగేవాడా. రెండోది క్వాలిటీ విద్య గ్రామీణ ప్రజలకు రాకుండా చూడటం ఆర్ఎస్‌ఎస్, బీజేపీ లక్ష్యం.
మీడియాలో చూపిస్తున్నట్టు బీజేపీ మంత్రులంతా ఆర్ఎస్‌ఎస్ సభ్యులే. కానీ వారి పిల్లలు అమెరికా, యూరప్‌లో ఎందుకు చదువుతున్నారు? వారు ఇక్కడ నడుపుతున్న విద్యావ్యవస్థ అటువంటి స్టాండర్డ్స్‌ని ఇవ్వనందుకే కనుక. కానీ ఈ దేశంలోని దళిత, ఆదివాసీ, ఓబీసీల పిల్లలు, అగ్రకులాల బీద పిల్లలు విదేశాలలో చదవలేరు. ఈ దేశంలో కూడా కార్పొరేట్ స్కూళ్లలో, కాలేజీల్లో యూనివర్సిటీల్లో చదవలేరు. వాళ్లు చదవగలిగేది గవర్నమెంట్ సంస్థల్లోనే. వీటిలో పురాతన పాఠాలు, ప్రాంతీయ భాషల్లో నేర్పితే వారు ఆధునిక ప్రపంచంలో ఎలా బతుకుతారు?
పేపర్ లీకుల అసలు పద్ధతి
పేపర్ లీకులు ధనవంతులు, అకాడమీలు ఉన్నవారి ద్వారా జరిపించుకుంటారు. ప్రైవేటు సంస్థలు పెద్ద మొత్తాన్ని ధనవంతుల దగ్గర డబ్బులు తీసుకుని వారి పిల్లలకు అప్పగిస్తుంటారు. ముందే పేపర్ తెప్పించుకుంటారు. అన్ని ఎంట్రన్స్ పరీక్షలు సరైన సమాధానం నంబర్‌ను, ప్రశ్న ఎదురుగా పెట్టడమే కనుక ఆ మొత్తం పేపర్ ఇంటి దగ్గర సరైన సమాధానాలతో నింపుకొని ఎగ్జామినేషన్ సెంటర్‌కు ఆ సీలును తీసుకుపోయేందుకు డబ్బులు ఇచ్చి ఏర్పాట్లు చేయించుకుంటారు.
ఈ పద్ధతి ఎంట్రన్స్, కోచింగ్ సెంటర్లు వచ్చినప్పటి నుంచి నడుస్తున్నప్పటికీ బీజేపీ పాలనలో ఇందుకోసం పెద్ద నెట్‌వర్క్ తయారైంది. ఇది నీతిమాలిన పని అని చేసేవాడికి కూడా తెలుసు. కానీ తమ పిల్లలకు చదువురాకున్నా డిగ్రీ రావాలంటే ఇదే చేయాలి. ఇది చాలా పకడ్బందీగా చేస్తున్నారు. దీన్ని ఆపడానికి చాలా పకడ్బందీ చర్యలు కావాలి. కానీ రాజకీయ అధికార పార్టీలతో ఈ గ్యాంగ్‌లకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి.
అందువల్ల దీన్ని ఆపడానికి చాలా పోరాటం చేయాల్సి ఉంది. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించి అన్ని దశల్లోని పైరవీలను అరికట్టకపోతే ఈ దందా ఆగదు.
విద్యారంగంలో స్టాండర్డ్స్ సమస్య చాలా ముఖ్యమైంది. చదువుకున్నా కూడా బతుకుదెరువు అవకాశాలు రెండో సమస్య. కనుక సీజేపీ మొత్తం విద్యావ్యవస్థ మీద ఒక చర్చను మొదలెట్టాలి. రిఫామ్ మార్గాలు, పద్ధతుల మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
అయితే, ఆర్ఎస్ఎస్, బీజేపీ నిర్మాణాలు తమ దగ్గర ఉన్న జాతీయవాద మంత్రం ప్రతి దానికి పనికొస్తుందని ఏ సంస్కరణలను అంగీకరించవు. మైనారిటీ వ్యతిరేక సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చారు. కానీ వారి అసలు టార్గెట్ గ్రామీణ వ్యవస్థలో శ్రమజీవులకు చదువు, జ్ఞానం, పోరాడే శక్తి రాకుండా ఉండడం అనేదే లక్ష్యం.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
