- లోహియా విచార్ మంచ్ ఆధ్వర్యంలో జాదవ్ వర్ధంతి సభ
పంజాగుట్ట, వెలుగు : తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల దిక్సూచి ప్రొ. కేశవరావ్ జాదవ్ అని..ఆయన జీవితం మానవ, ప్రజాస్వామ్య విలువలు ఉట్టిపడేలా కొనసాగిందని వక్తలు కొనియాడారు. వక్తగా, మేధావిగా, ఓ మానవతావాదిగా సమాజానికి జాదవ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రొ. కేశవరావు జాదవ్ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసి, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో లోహియా విచార్ మంచ్ అద్వర్యంలో కేశవరావు జాదవ్ 8వ వర్థంతి సభ జరిగింది. దీనికి సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి, ప్రొ. హరగోపాల్, ఫ్రొ. గాలి వినోద్ కుమార్, అరుణోదయ విమలక్క, పసునూరి రవిందర్, సీనియర్ సోషలిస్టు, న్యాయవాది రాందాస్, ఆమ్ ఆద్మి పార్టీ స్నేహ, ప్రొ.తిరుమలరావు, తాహెర్ కుందాన్, మన్నారం నాగరాజు, పృద్విరాజ్, రాష్ర్ట గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ డా.రియాజ్పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..కేవలం బౌగోళిక తెలంగాణ కాదని, సామాజిక తెలంగాణను జాదవ్ కోరుకున్నారని గుర్తు చేశారు. ఆరోగ్యం సహకరించకున్నా ఉద్యమాల నిర్మాణం కోసం ఆయన చేసిన కృషిని, పోరాట స్పూర్తిని భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. బడుగు బలహీన వర్గాలే పాలన చేయాలని కోరుకున్నారని, జాదవ్ ఆశయం నెరవేరాల్సిన అవసరం ఉందన్నారు. జాదవ్ భావజాలాన్ని ప్రచారం చేస్తే ఆయన్ను బ్రతికించినట్లేనని వక్తలు పేర్కొన్నారు.
