భూసేకరణపై కేంద్రానికి రాష్ట్ర సర్కారు తప్పుడు నివేదికలు

భూసేకరణపై కేంద్రానికి రాష్ట్ర సర్కారు తప్పుడు నివేదికలు

న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌(నిమ్జ్‌‌‌‌‌‌‌‌)కు తప్పుడు సమాచారంతో అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. నిమ్జ్​ భూసేకరణలో 90 శాతం వ్యవసాయ భూమి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతమే వ్యవసాయానికి వినియోగిస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్​ ఇచ్చిందన్నారు. నిమ్జ్ భూసేకరణ, తప్పుడు నివేదికపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్​కు కోదండరాం ఫిర్యాదు చేశారు. గురువారం ఢిల్లీలో భూనిర్వాసితుల సంఘం నేతలు ఆశప్ప, రాఘవరెడ్డితో కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. భూ దోపిడీ, భూ నిర్వాసితుల కష్టాలను కేంద్ర మంత్రికి వివరించామని ఆయన చెప్పారు. నిమ్జ్ పేరిట 12,630 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని, దీంతో 22 గ్రామాలు బతుకుదెరువును కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల విలువ చేసే భూముల్ని రూ.10 లక్షల నామమాత్రపు రేటుకు గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. 12 వేల ఎకరాల్లో 4,200 ఎకరాలే పరిశ్రమలకు వాడతారని.. రిక్రియేషన్, పార్క్ ల కోసం మిగతా 7,800 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. పారిశ్రామికవాడల కోసం 10 శాతం కన్నా తక్కువగా సాగవుతున్న వ్యవసాయ భూముల్ని తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం పంట సాగవుతున్న భూముల్ని లాక్కుంటోందని ఆరోపించారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కోదండరాం చెప్పారు. రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా భూముల్ని లాక్కుంటోందని భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ భవన్ లో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించారు.