
బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ఆత్మ) ఉద్యోగులకు భద్రత కల్పించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో అసోసియేషన్ డైరీని ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
12 ఏండ్లుగా అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే ఉద్యోగ భద్రత లేదని, ఎలాంటి ఇంక్రిమెంట్ఇవ్వడం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. కృష్ణ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ అనుబంధ శాఖలతో పాటు ఏఈఓ బాధ్యతలకు తమకు పీఆర్సీ కూడా అమలు కావడం లేదన్నారు. ఆత్మ ఉద్యోగులను మణిపూర్ , సిక్కిం రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారో అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో విలీనం చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి , ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చూస్తానని కోదండరాం వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆత్మ సెక్షన్ అధికారులతో పాటు తెలంగాణ ఆత్మ స్టాఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎం. సురేందర్ రెడ్డి, ట్రెజరర్ జ్యోతిలక్ష్మి , వైస్ ప్రెసిడెంట్ అపర్ణ రెడ్డి, సాయి చరణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.