పంజాగుట్ట, వెలుగు: దేశంలో 80 శాతమున్న జనాభాకు బడ్జెట్లో అత్యల్ప నిధులు కేటాయించడం హాస్యస్పదంగా ఉందని ప్రొఫెసర్ మురళీ మనోహర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ బీసీకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. జనాభాలో అధిక శాతమున్న వారి ఓట్లతో అల్ప సంఖ్యాకులు రాజ్యమేలుతున్న దుస్థితి నుంచి బయట పడాల్సిన అవసరముందన్నారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సంయుక్తంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర బడ్జెట్ తీరు తెన్నులను విశ్లేశించారు.
సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ.. హక్కులు అడుక్కుంటే రావని, ఐక్యంగా ఉద్యమించినప్పుడే వాటిని సాధించడం సులభతరం అవుతుందన్నారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడ్మాట్లాడుతూ.. ఐక్య ఉద్యమానికి బీసీలందరూ తరలిరావాలని సూచించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. బీసీలంతా సబ్సిడీలపై ఆధారపడకుండా హక్కుల కోసం పోరాడితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు.
సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేత విశారధన్ మహారాజ్, వివిధ బీసీ సంఘాల నేతలు వెంకన్న నేత, ఐలి వెంకన్న గౌడ్, యస్. దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, గోలి యాదగిరి, రజక జన సైన్యం అద్యక్షుడు సింగం నాగేశ్, ఎర్రం సత్యనారాయణ, అంబాల నారాయణ గౌడ్, ఆంజనేయులు, శంకర్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.
