పొంగుతున్న వాగులు.. నిండుతున్న ప్రాజెక్టులు

పొంగుతున్న వాగులు.. నిండుతున్న  ప్రాజెక్టులు

వెలుగు నెట్​వర్క్​:  రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వానల వల్ల వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా, ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో అత్యధికంగా 12.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఎస్సారెస్పీలోకి 10వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా, కడెంలోనూ నీటిమట్టం పెరుగుతోంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్​లోకి ప్రాణహిత నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో ఆఫీసర్లు 16 గేట్లు ఓపెన్ చేసి 45 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

మేడిగడ్డ బ్యారేజీకి 43 వేల క్యుసెక్కుల ఇన్‌‌ఫ్లో

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో సగటున 4 సెంటీమీటర్లు, ములుగు జిల్లాలో సగటున 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  మహాదేవ్‌‌పూర్‌‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నది నుంచి 43 వేల క్యుసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. దీంతో నీటిపారుదల శాఖ ఆఫీసర్లు 16 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మహబూబాబాద్​ జిల్లాలోని తొర్రూరు మండలంలోని అమ్మపురం పెద్ద చెరువు మత్తడి దుంకుతోంది. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో 12.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గాంధారి, బాన్సువాడల్లో  9.7 సెం.మీ, పెద్దకొడప్​గల్​లో 9.3, తాడ్వాయిలో 8.7,  దోమకొండలో 8.6 , పిట్లంలో 8.4 సెం.మీ, రాజంపేట, నిజాంసాగర్​ మండలాల్లో 8, లింగంపేటలో 7.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. కామారెడ్డి మున్సిపల్​పరిధిలోని కస్తూర్బా స్కూల్​ ఆవరణలోకి వర్షం నీళ్లు చేరాయి.  నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో 7 సెం.మీ, కోటగిరి మండలం కొత్తపేటలో  6.9,  నవీపేటలో 6.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతుండటంతో సోమవారం మధ్యాహ్నం నీటి మట్టం 12 అడుగులకు చేరింది. నిజామాబాద్ టౌన్​లో దాదాపు 3 గంటల పాటు ఆగకుండా వాన పడింది. దీంతో ట్రాఫిక్​జాం అయ్యి వెహికల్స్​రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  

వట్టివాగుకు వరద పెరగడంతో..

నిజామాబాద్​లో 188 .2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వర్షం పడింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో 38.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు1042.09 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 638.70 అడుగుల నీరు చేరింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమనేపల్లి మండలం దిందా , బెజ్జూర్ మండలం సోమిని , సుస్మిర్ వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెంచికల్ పేట్, దహెగాం మండలాల మధ్య అనుసంధానంగా ఉన్న పెద్ద వాగు నీటి ప్రవాహంతో రాకపోకలు ఆగిపోయాయి. వట్టివాగుకు వరద పెరగడంతో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు.  ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 2.48 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 238.5 మీటర్లు ఉంది. ఇన్ ఫ్లో 1846 క్యూసెక్కులుండగా ఔట్​ఫ్లో 2167 క్యూసెక్కులుగా ఉంది. తిర్యాణి మండలం ఉల్లి పిట్ట , లింగాపూర్ మండలంలోని మిట్టె (సప్తగుండాల), ఆదిలాబాద్​జిల్లాలోని కుంటాల, పొచ్చర, గాయత్రి జలపాతాలు  ఆకట్టుకుంటున్నాయి. మత్తడివాగు, సాత్నాల ప్రాజెక్టులకు కూడా వరద వచ్చి చేరుతోంది.  జిల్లా వ్యాప్తంగా సోమవారం రెండు సెంటిమీటర్ల వాన పడింది. 

ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఆగకుండా కురుస్తున్న వానలతో సింగరేణి ఓపెన్​కాస్ట్​ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్,​ బెల్లంపల్లి ఏరియాలోని ఆర్కేపీ ఓసీపీ, కేకే ఓసీపీ, ఎస్సార్పీ ఓసీపీ, ఇందారం ఓసీపీ, ఖైరీగూడ ఓసీపీల్లో సుమారు 45వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారు 5లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​బర్డెన్​(మట్టి) వెలికితీయలేకపోయారు. ఓసీపీ ఇంటర్నల్​ రోడ్లన్నీ బురదమయంగా మారడంతో భారీ వాహనాలు యార్డులకే పరిమితమయ్యాయి. ఓసీపీల్లోని క్వారీ(పనిస్థలం)లోకి చేరిన నీటిని హెవీ మోటర్ల సాయంతో బయటకు పంపించే పనులు చేపట్టారు. ఓసీపీ యార్డుల్లో స్టాక్​ కోల్​ను ట్రాన్స్​పోర్ట్​ చేసే పనులు నడిచాయి.

సోమవారం తెల్లవారుజామున..

సోమవారం తెల్లవారుజామున మందమర్రి ఏరియాలోని కాసీపేట–-2 బొగ్గు గని సమీపంలో ఉన్న కోమటిచేను శివారులో దేవాపూర్​ ఓరియంట్ సిమెంట్​ఫ్యాక్టరీకి వెళ్లే హైటెన్షన్ పవర్ తీగలు తెగి మైన్​కు వచ్చే  పవర్ లైన్లపై పడ్డాయ. ఇదే టైమ్​లో  డ్యూటీకి వస్తున్న ముగ్గురు ఉద్యోగులు తీగలను గుర్తించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గనికి కరెంట్​ సరఫరా నిలిచిపోవడంతో మేనేజ్​మెంట్​ మొదటి షిప్టుకు లే ఆఫ్ ప్రకటించింది. సాయంత్రం సరఫరా పునరుద్ధరించడంతో రెండో షిప్టుకు ఎంప్లాయిస్​ హాజరయ్యారు. అలాగే తాడిచర్ల ఓపెన్ కాస్ట్​లోకి  భారీగా వరద చేరడంతో 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, లక్షా ముప్పై వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికి తీత పనులు నిలిచిపోయినట్టు జెన్​కో జీఎంలు చంద్రమౌళి, కేఎస్ఎన్ మూర్తి, ఏఎంఆర్ సీపీఆర్వో వెంకట్ తెలిపారు.