న్యూఢిల్లీ: ఈ ఏడాది విదేశీ వ్యవహారాల శాఖకు రూ. 22,118 కోట్లను కేంద్రం కేటాయించింది. గతేడాది బడ్జెట్ అంచనా (రూ.20,516 కోట్లు) కంటే ఎక్కువ. ‘‘నైబర్హుడ్ ఫస్ట్” పేరుతో విదేశాల్లో ఇండియా వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో భాగంగా భూటాన్‌కు అత్యధికంగా రూ.2,288 కోట్లు, నేపాల్‌కు రూ.800 కోట్లు, మాల్దీవులుకు రూ.550 కోట్లు, మారిషస్‌కు రూ.550 కోట్లు కేటాయించింది.
ఇటీవల బంగ్లాదేశ్ తో దౌత్య సంబంధాలు క్షీణించడంతో రూ.60 కోట్లు మాత్రమే కేటాయించింది. శ్రీలంకకు రూ.400 కోట్లు, మయన్మార్ లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ.300 కోట్లను అలాట్ చేసింది. మానవతా దృక్పథంతో అఫ్గానిస్తాన్ కు చేస్తున్న సాయాన్ని ఈ ఏడు రూ.150 కోట్లకు పెంచింది.
(గతేడాది ఈ మొత్తం రూ.100 కోట్లుగా ఉంది). లాటిన్ అమెరికన్ దేశాలకు మొత్తం రూ.120 కోట్లు కేటాయించారు. ఇరాన్ లోని వ్యూహాత్మక చాబహార్ పోర్ట్ కు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మొత్తం విదేశీ అభివృద్ధి భాగస్వామ్య నిధిని రూ.6,997 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో రూ.4,548 కోట్లు కేవలం మన తక్షణ పొరుగు దేశాల కోసమే కేటాయించారు.
