భారీ వర్షాలకు నిండుకుండలా మారిన ప్రాజెక్టులు

భారీ వర్షాలకు నిండుకుండలా మారిన ప్రాజెక్టులు

రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా.. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కడెం, జూరాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో గల ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా..ప్రస్తుతం 145.20 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.0873 టీఎంసీల నీరు ఉంది. 

నిజామాబాద్ జిల్లాలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. 26 గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా..ప్రస్తుతం 1087.3 అడుగుల నీరు ఉంది.నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695 అడుగులు నీరు ఉంది. ఇన్ ఫ్లో2,16,000  క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ ఫ్లో  2 లక్షల  క్యూసెక్కులుగా ఉంది. ఇక పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.

జూరాలలో 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి

మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.080 మీటర్ల నీరు ఉంది. ఇన్ ఫ్లో 16,400 క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 23,043 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో 3 యూనిట్లలో విద్యుతుత్పత్తిని చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.950 టీఎంసీల నీరు ఉంది. లోయర్ మానేరు డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 280.480 మీటర్లు కాగా ప్రస్తుతం 274.07 మీటర్ల నీరు ఉంది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టుకి భారీ వరద వస్తోంది. 3 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1183 అడుగులు కాగా..ప్రస్తుతం 1179.8 అడుగుల నీరు ఉంది. ఇన్ ప్లో 13వేల క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 14,100 క్యూసెక్కులుగా ఉంది.