జోషిపై లింగాయత్ స్వామి పోటీ .. ధార్వాడ్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటన

జోషిపై లింగాయత్  స్వామి పోటీ .. ధార్వాడ్ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటన

బెంగళూరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిపై పోటీగా ధార్వాడ్ లోక్ సభ బరిలోకి దిగుతున్నట్లు వీరశైవ లింగాయత్  గురువు దింగాళేశ్వర్ స్వామి ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. వీరశైవ లింగాయత్ లు, ఇతర సామాజికవర్గాల వారిని జోషి అణచివేశారని ఆయన ఆరోపించారు. లింగాయత్  మఠాలను దుర్వినియోగం చేశారని, అధికారంలో ఉండేందుకు వారిని తీవ్రంగా అవమానించారని ఫైర్  అయ్యారు. 

సోమవారం మీడియాతో స్వామి మాట్లాడారు. ఇతర సామాజికవర్గాల వారిని అణచివేయడంలో ప్రహ్లాద్  జోషి హీరో అని,  అభివృద్ధి విషయంలో ఆయన జీరో అని ఎద్దేవా చేశారు. ఈ కారణాల వల్లే తాను ఆయనపై పోటీ చేయాలని నిర్ణయించానని తెలిపారు. కాంగ్రెస్  పైనా ఆయన సీరియస్  అయ్యారు. అధికారంలోకి రావడానికి బీజేపీలాగే కాంగ్రెస్ కూడా లింగాయత్ సామాజికవర్గం వారిని వాడుకుని వదిలేసిందని మండిపడ్డారు. 

అధికారంలోకి వచ్చాక లింగాయత్  వర్గానికి చెందిన లీడర్లకు కాంగ్రెస్  సరైన స్థానం ఇవ్వలేదన్నారు. రెండు పార్టీలూ ధార్వాడ్  నియోజకవర్గ ప్రజలకు నమ్మకద్రోహం చేశాయన్నారు. ధార్వాడ్  ప్రజలు తనను వారి అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించారని చెప్పారు.

స్వామి తిట్టినా నాకు ఆశీర్వాదమే: జోషి

దింగాళేశ్వర్  స్వామి వ్యాఖ్యలపై జోషి స్పందించారు. స్వామి తిట్టినా తనను ఆశీర్వదించినట్లేనని ఆయన పేర్కొన్నారు. తమ మధ్య ఏమైనా అపోహలు ఉంటే పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.