సొంతపార్టీ మున్సిపల్ చైర్మన్ను నిలదీసిన కౌన్సిలర్లు

 సొంతపార్టీ మున్సిపల్ చైర్మన్ను నిలదీసిన కౌన్సిలర్లు
  • నల్ల కండువాలతో ​హాల్​ ఎదుట బైఠాయింపు

ఇల్లందు,వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంగళవారం జరిగిన మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. టీఆర్ఎస్​​ పార్టీకి  చెందిన కౌన్సిలర్లు అదే పార్టీకి చెందిన చైర్మన్​ తీరును నిరసిస్తూ నల్ల కండువాలతో మీటింగ్​ హాల్​ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఇప్పటికే చైర్మన్​కు వ్యతిరేకంగా మహిళా కౌన్సిలర్లు ఎస్పీ, కలెక్టర్, హ్యూమన్ రైట్స్ కమిషన్​,  ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మీటింగ్​కు 11మంది అసమ్మతి కౌన్సిలర్లు నల్ల కండువాలతో హాజరయ్యారు.

సమావేశం మొదలైన వెంటనే రెండున్నర సంవత్సరాలకు సంబంధించిన మినిట్స్ బుక్​ను ఇవ్వాలని  కమిషనర్​ను కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మినిట్స్ బుక్​ ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని, ఒక నెల ఆగాలని అనడంతో వారంతా వెంటనే ఇవ్వాలని కమిషనర్​ను కోరారు. అనంతరం సమావేశం నుంచి వాకౌట్ చేసి మీటింగ్​ హాల్​ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను అధికారులకు తెలపకుండా చైర్మన్  అడ్డుకోవడం ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

చైర్మన్ పై చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు . వైస్​ చైర్మన్ జానీ పాషా, కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరరావు, జేకే శ్రీనివాస్, తోట లలిత, శారద, సిలివేరు అనిత, చీమల సుజాత, సామల మాధవి, పత్తి స్వప్న, కాబోలు స్వాతి, సరిత పాల్గొన్నారు.